Share News

జోన్‌ వచ్చిందోచ్‌

ABN , Publish Date - May 06 , 2026 | 04:11 AM

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు అనేది నాలుగు దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో ఎట్టకేలకు అది సాకారమైంది.

జోన్‌ వచ్చిందోచ్‌

  • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌.. గెజిట్‌ విడుదల

  • జోన్‌, డివిజన్ల పరిధి స్పష్టీకరించిన కేంద్రం

  • దక్షిణ మధ్య, తూర్పు కోస్తా రైల్వే జోన్లలోని కొన్ని భాగాలతో కొత్తగా దక్షిణ కోస్తా జోన్‌

  • దీని పరిధిలోకి గుంతకల్‌, గుంటూరు, బెజవాడ, వాల్తేరు డివిజన్‌లోని కొన్ని భాగాలు

  • రాయగడ, విశాఖ డివిజన్లుగా ‘వాల్తేరు’ విభజన

  • నాలుగు దశాబ్దాల కల సాకారం

  • భూమి అప్పగింతలో నాడు వైసీపీ నిర్లక్ష్యం

  • కూటమి రాకతో జోన్‌కు ఎట్టకేలకు జోష్‌

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు అనేది నాలుగు దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆ గెజిట్‌లో కేంద్రం ప్రకటించింది. ‘దక్షిణ కోస్తా జోన్‌’ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్‌ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక రైల్వే జోన్‌ లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ ఇన్నాళ్లూ నడిచింది. ప్రధాని నరేంద్రమోదీ 2019 ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం వచ్చినపుడు రైల్వే జోన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని హామీ అమలు కావడానికి ఏడేళ్ల సమయం పట్టింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించిన తరువాత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్ల వరకు మంజూరుచేసింది. అయితే అవసరమైన భూముల కేటాయింపులో నాటి వైసీపీ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఒక విధంగా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ముందుకువెళ్లకుండా మోకాలడ్డు పెట్టిందనే చెప్పాలి. విశాఖపట్నంలో బీఆర్‌టీఎస్‌ రహదారులకు, ఇతర అవసరాలకు రైల్వేకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. వాటికి ప్రత్యామ్నాయంగా ముడసర్లోవలో 52.2 ఎకరాలు కేటాయించింది. నగరానికి దూరంగా ప్రశాంతంగా ఉండే ఆ భూముల్లోనే రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అయితే ఆ భూముల్లో అప్పటికే ఆక్రమణదారులు ఉన్నారు. రైల్వే అధికారులు ఆ భూముల్లోకి వెళ్లినప్పుడల్లా రైతులు అడ్డుకునేవారు. దాంతో పనులు ముందుకుసాగలేదు. ఆక్రమణదారులను అక్కడి నుంచి పంపించి భూములు అప్పగించడంలో నాటి వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఈ క్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఒకసారి విశాఖపట్నం రాగా బీజేపీ నాయకులు రైల్వే జోన్‌ కార్యాలయం పనులు ప్రారంభించాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ నాటి జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునను పిలిచి, రైల్వేకు భూములు ఇస్తే వారం రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. అయినా వైసీపీలో వీసమెత్తు చలనం రాలేదు. భూమి అప్పగించలేదు.


కూటమి రాగానే ట్రాక్‌పైకి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వే జోన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముడసర్లోవ భూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో ఆ గ్రామం సర్వే నంబర్లు 57, 58, 59/1, 61/1, 62, 63, 64, 65 (పాత సర్వే నంబరు26)లలో 52.22 ఎకరాల భూమిని అదే ఏడాది ఆగస్టు నెలాఖరున రైల్వే అధికారులకు దగ్గరుండి ఇప్పించింది. ఆ భూమిని మ్యుటేషన్‌ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో రైల్వే శాఖపై మార్పు చేసింది. దీనికోసం కలెక్టర్‌ 542/2024 నంబరుతో ఆగస్టు 30న ప్రొసీడింగ్స్‌ జారీచేశారు. జోన్‌ కార్యాలయ భవన నిర్మాణానికి 2025 జనవరి 8న ప్రధాని నరేంద్రమోదీతో శంకుస్థాపన చేయించారు. ఇన్ని జరిగినా కొత్త జోన్‌ ఆపరేషన్‌కు అవసరమైన ‘గెజిట్‌’ నోటిఫికేషన్‌ ఇవ్వడంలో తాత్సారం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గత నెల 28న గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన నిమిత్తం విశాఖపట్నం వచ్చినప్పుడు దీనిపై స్పందించారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి జోన్‌ ఆపరేషన్‌ ప్రారంభిస్తామని సభలో ప్రకటించారు. వారం రోజులు తిరక్కుండానే నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ పనిచేయడానికి పూర్తి అనుమతి లభించినట్టయింది.

విశాఖ నుంచే కేకే లైన్‌ నిర్వహణ

కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్‌ పరిధిలో చేర్చిన కొత్తవలస-కిరండూల్‌ (కేకే లైన్‌), కొరాపుట్‌-రాయగడ (కేఆర్‌) లైన్‌ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్‌ అధికారులే చూస్తారని రైల్వే వర్గాలు మంగళవారం తెలిపాయి. కొందరు కేకే లైన్‌ విశాఖ డివిజన్‌లోనే ఉంచారంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి.


మిన్నంటిన సంబరాలు

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకులు మంగళవారం స్టేషన్‌ వద్ద సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేశారు. బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ పెతకంశెట్టి గణబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ సాకారమైందన్నారు.

గెజిట్‌లోనే పరిధి..

రైల్వే జోన్‌ పరిధి, అందులో డివిజన్లు, వాటి పరిధి మొత్తం ‘గెజిట్‌’ ద్వారానే వెల్లడిస్తారు. అది విడుదలైతేనే అధికారుల నియామక ప్రక్రియ వేగవంతం అవుతుంది. సోమవారం రాత్రి విడుదల చేసిన గెజిట్‌లో కొత్త రైల్వే జోన్‌ పరిధి, అందులో డివిజన్లు, వాటి విస్తృతిని వివరించారు. కొత్త డివిజన్ల ఏర్పాటు, పాత డివిజన్లలో మార్పులపై పూర్తి స్పష్టత ఇచ్చారు.

ఇదీ దక్షిణ కోస్తా జోన్‌..

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఉన్న గుంతకల్‌, గుంటూరు, విజయవాడ డివిజన్లు; తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌లో విడగొట్టిన భాగం కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌గా ఏర్పాటుచేశారు.

వాల్తేరు డివిజన్‌ రెండుగా విభజన

వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలు చేశారు. అందులో ఒక భాగంతో కొత్తగా ‘రాయగడ డివిజన్‌’ ఏర్పాటు చేసి తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో కలిపారు. మిగిలిన రెండో భాగాన్ని ‘విశాఖపట్నం డివిజన్‌’గా నామకరణం చేసి కొత్త జోన్‌లో ఉంచారు. రాయగడ డివిజన్‌ ఆపరేషన్‌కు కూడా కొత్త జోన్‌తో పాటే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేశారు.

ఆ డివిజన్ల నుంచి విభజన

సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న గుంతకల్‌, గుంటూరు డివిజన్ల నుంచి కొన్ని భాగాలను సికింద్రాబాద్‌కు మార్చారు. రాయచూర్‌-వాడి వరకు 108 కిలోమీటర్ల గుంతకల్‌ డివిజన్‌ నుంచి సికింద్రాబాద్‌కు, విష్ణుపురం-పగిడిపల్లి-జనపహాడ్‌ వరకు 142 కి.మీ. గుంటూరు డివిజన్‌ నుంచి సికింద్రాబాద్‌కు, కొండపల్లి-మోటమర్రి వరకు 46 కి.మీ. సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి విజయవాడ డివిజన్‌కు మారుస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు.

Updated Date - May 06 , 2026 | 04:12 AM