దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే
ABN , Publish Date - May 31 , 2026 | 05:07 AM
ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు..
విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభం
జోన్ పరిధిలో 3,501 కి.మీ. పొడవైన ట్రాక్
385 రైల్వే స్టేషన్లు.. 17 వేల మంది ఉద్యోగులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌ను విభజించి కొత్తగా ఏర్పాటుచేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉంటుంది. కార్యకలాపాల ప్రారంభ తేదీగా నిర్ణయించిన జూన్ 1న నాలుగు డివిజన్ల రైల్వే మేనేజర్లు విశాఖ వచ్చి జీఎం సందీప్ మాధుర్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. జోన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. వారితో జీఎం తొలి భేటీ కూడా ఉంటుంది. విశాఖపట్నం సిరిపురంలోని ‘ది డెక్’’ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో 3,501 కి.మీ. పొడవైన ట్రాక్ ఉంది. నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం 385 రైల్వే స్టేషన్లు ఉండగా, మొత్తం 17వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయంలో 1,200 మంది పనిచేస్తున్నారు.
ఏటా రిక్రూట్‌మెంట్.. తెలుగువారికి ప్రాధాన్యం
ఉత్తరాంధ్ర నిరుద్యోగులు రైల్వే పరీక్షలు రాయడానికి తూర్పు కోస్తా రైల్వే జోనల్ కేంద్రం భువనేశ్వర్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులు ‘తెలుగువారు’ అనే వివక్ష చూపించి, అవకాశాలు ఇచ్చేవారు కాదు. మనకూ ఒక జోన్ ఉంటే ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో విశాఖ కేంద్రంగా జోన్ కోసం ఉద్యమం చేసి సాధించుకున్నారు. ఈ పరీక్షలకు కేంద్రాలను జోనల్‌కార్యాలయమే ఎంపిక చేస్తుంది. దాంతో ఈ ప్రాంతం వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
ఆదాయానికి అపార అవకాశాలు
రైల్వేకు సరకు రవాణా ద్వారానే అధిక ఆదాయం వస్తుంది. విశాఖపట్నం కేంద్రంగా నడిచిన వాల్తేరు డివిజన్ సరకు రవాణాలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. ఏటా 85 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసేది. ఈ డివిజన్ పరిధిలో కొత్తవలస-కిరండూల్ (కేకే) లైన్ ఉండటమే దీనికి ప్రధాన కారణం. బైలదిల్లా గనుల నుంచి ముడి ఇనుము ఈ మార్గం ద్వారానే రవాణా జరగడం వల్ల ఏటా రూ.10వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. అయితే కొత్త జోన్ కోసం వాల్తేరు డివిజన్‌ను విడదీశారు. ఒడిశాలో ఉన్న భాగం అంతా రాయగఢలో కలిపి కొత్త డివిజన్ ఏర్పాటుచేశారు. కేకే లైన్ అటు వెళ్లిపోయింది. అయినా 2025-26లో ఒక్క విశాఖపట్నమే 40 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసింది.
ప్రయోజనాలు..
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో)గా వి.బాలాజీ కిరణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, జోనల్ కార్యాలయం స్థానికంగా ఉండటం వల్ల రైళ్ల ఆపరేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు త్వరితంగా వస్తాయి. మైనర్ ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా లభిస్తాయి. మౌలిక వసతుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.