ఇక నాలుగు రైల్వే లైన్లు
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:27 AM
దక్షిణ కోస్తా జోన్‌లో నాలుగు వరుసల రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్టు జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ వెల్లడించారు. ఇది ఇచ్ఛాపురం-విశాఖపట్నం-విజయవాడ-గూడూరు-రేణిగుంట వరకూ ఉంటుందన్నారు.
ఆదాయం, సరుకు రవాణాలో టాప్ 5లో దక్షిణ కోస్తా జోన్
తిరుపతిలో 20 కోట్లతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు
గోదావరి పుష్కరాలకు రైల్వే తరఫునా ఏర్పాట్లు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాధుర్
విశాఖపట్నం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా జోన్‌లో నాలుగు వరుసల రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్టు జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ వెల్లడించారు. ఇది ఇచ్ఛాపురం-విశాఖపట్నం-విజయవాడ-గూడూరు-రేణిగుంట వరకూ ఉంటుందన్నారు. ప్రస్తుతం రెండు రైల్వే లైన్లు ఉండగా, మూడో లైన్ నిర్మాణం జరుగుతోందని, త్వరలో నాలుగో లైన్ కూడా వస్తుందన్నారు. విశాఖ కేంద్రంగా జోన్ ఆపరేషన్లు ప్రారంభించి రెండు నెలలు పూర్తయిన తరువాత ఆయన తొలిసారిగా గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకూ చేపట్టిన పనుల ప్రగతిని వివరించారు. ‘ఈ ఏడాది చివరికి 100 లోకోమోటివ్‌లకు, 100 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు ‘కవచ్’ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తాం. దీంతో రైళ్లు ఒకదానితో మరొకటి ఢీకొట్టే అవకాశం ఉండదు. కొత్త జోన్ ఆదాయం, సరకు రవాణాలో దేశంలో టాప్ ఐదు జోన్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా చేసి రూ.15,500 కోట్ల ఆదాయం సాధిస్తామని అంచనా వేస్తున్నాం. ఈ జోన్ పరిధిలో ఏడు లోకోమోటివ్ షెడ్లు, మూడు వర్క్‌షాపులు, ఏడు కోచింగ్ డిపోలు, 4 ఫ్రైట్ డిపోలు ఉన్నాయి. రాష్ట్రంలో నాలుగు మేజర్ పోర్టులకు సేవలు అందిస్తున్నాం. జోన్‌లో నాలుగు డివిజన్లు (విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్) ఉండగా, వాటి పరిధిలో 3,532 రూట్ కిలోమీటర్లు(ఆర్‌కేఎం), 6,455 ట్రాక్ కిలోమీటర్ల(టీకేఎం) రైల్వే లైన్లు ఉన్నాయి. గత రెండు నెలల్లో వీటిలో 1,700 ఆర్‌కేఎం, 3000 టీకేఎంలను తనిఖీ చేశాం. మౌలిక వసతులు, స్థానిక ప్రజల అవసరాలు, ప్రాజెక్టుల పురోగతి, భద్రతా ప్రమాణాలను పరిశీలించాం’ అని మాధుర్ వివరించారు.
రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు
‘జోన్‌లో రూ.54,479 కోట్లతో ఐదు కొత్త రైల్వే లైన్లు, 24 మల్టీ-ట్రాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఇవికాకుండా మరో రూ.70,865 విలువైన ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. వివిధ డివిజన్లలో మొత్తం 300 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు నిర్మించనున్నాం. విశాఖపట్నానికి రూ.300 కోట్ల విలువైన యార్డ్ రీమోడలింగ్ ప్రాజెక్టు మంజూరైంది. దీనివల్ల విశాఖపట్నం స్టేషన్‌లో అదనంగా ఆరు ప్లాట్‌ఫారాలు, ప్లాట్‌ఫారాల విస్తరణ, ఎలకా్ట్రనిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తాయి. రూ.1,205 కోట్లతో గుంతకల్-బళ్లారి మధ్య నాలుగు వరుసల రైల్వే లైన్ ప్రాజెక్ట్, తిరుపతిలో రూ.20 కోట్లతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నాం. నరసాపూర్-విజయవాడ, గరుగుబిల్లి-విశాఖపట్నంలలో యార్డు రీమోడలింగ్ పనులు, నెల్లూరు-తెలమంచి సెక్షన్‌లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది రాజమహేంద్రవరంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రైల్వే తరఫున ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు.
ఇప్పటికి 2493 కోట్ల ఆదాయం
‘డిమాండ్ అధికంగా ఉందన్న కారణంతో నాలుగు ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చాం. జోన్ నుంచి 29.4 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.671 కోట్ల ఆదాయం సమకూరింది. సరకు రవాణాతో కలిపితే రూ.2,493 కోట్ల ఆదాయం వచ్చింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంగా మారినందున మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయి’ అని జీఎం వివరించారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును విశాఖలో ఏర్పాటు చేస్తారా? అనే ప్రశ్నకు... ‘అది బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టవచ్చు. ఎక్కడికక్కడే పరీక్షా కేంద్రాలు ఉన్నందున, బోర్డు ఎక్కడున్నా ఒకటే. కొత్త జోన్‌ను ప్రస్తుతం 60ు సిబ్బందితో నడుపుతున్నాం. దశల వారీగా అన్నీ సమకూరతాయి’ అని జీఎం వివరించారు.