Share News

తండ్రి హంతకుడిని వేటాడిన తనయుడు

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:44 AM

నాలుగేళ్ల క్రితం తన తండ్రిని చంపిన వ్యక్తిపై కక్ష పెంచుకున్న కుమారుడు.. ఆ వ్యక్తిని వెంబడించి, వేటాడి హత్య చేశాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురం గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది

తండ్రి హంతకుడిని వేటాడిన తనయుడు
SON

  • నాలుగేళ్ల తర్వాత ప్రతీకారం

నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల క్రితం తన తండ్రిని చంపిన వ్యక్తిపై కక్ష పెంచుకున్న కుమారుడు.. ఆ వ్యక్తిని వెంబడించి, వేటాడి హత్య చేశాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురం గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... 2022 జూలైలో వెంకటాద్రిపురం గ్రామానికి చెందిన కూచిపూడి రంగా తన భార్యను దుర్భాషలాడాడనే కారణంతో గొల్లపల్లి శ్రీనివాసరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాసరావు మృతిచెందాడు. అప్పటి నుంచి రంగా వెంకటాద్రిపురం నుంచి నూజివీడు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాడు. అయితే ఆదివారం ఓ పని నిమిత్తం రంగా వెంకటాద్రిపురం రావడాన్ని శ్రీనివాసరావు కుమారుడు డానియెల్‌ గమనించాడు. దాడి చేసేందుకు రంగాను వెంబడించాడు. దీంతో ప్రాణ భయంతో పరుగెత్తిన రంగా.. గ్రామంలోని పల్లెపాము నాగేంద్రరావు ఇంట్లోకి దూరాడు. అయితే డానియెల్‌తోపాటు అతని బంధువులు ఏలేషు, తరుణ్‌... రంగాను బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఈ క్రమంలో తలపై తీవ్ర గాయాలు కావడంతో రంగా అక్కడికక్కడే మృతి చెందాడు. నూజివీడు రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రంగా తల్లి వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 28 , 2026 | 05:47 AM