Share News

అంటే.. చంపేస్తారా?

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:21 AM

మేము అధికారంలోకి వచ్చాక ‘ఆంధ్రజ్యోతి’ ఉండదు. ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఉండరు’ అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే..

అంటే.. చంపేస్తారా?

  • ఇంకో గొడ్డలి తయారు చేసుకుని ఉన్నారా?

  • ‘ఆంధ్రజ్యోతి’ రద్దు కోసం మీకు ఓట్లు వేయాలా?: సోమిరెడ్డి

నెల్లూరు, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘‘మేము అధికారంలోకి వచ్చాక ‘ఆంధ్రజ్యోతి’ ఉండదు. ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఉండరు’ అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే.. రాధాకృష్ణను చంపేస్తారా? బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసినట్లు ఇంకో గొడ్డలి తయారు చేసుకొని ఉన్నారా? ఏమిటీ.. వైసీపీ ధోరణి?’ అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో వైసీపీపై ధ్వజమెత్తారు. శుక్రవారం నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎవరైనా అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రజలకు ఫలానా ప్రయోజనం చేసే ఫైలు మీద సంతకం చేస్తామని చెబుతారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు పింఛన్‌ పెంపుపై తొలి సంతకం పెడతామని చెప్పారు. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి తొలి సంతకం ‘ఆంధ్రజ్యోతి’ రద్దు మీద పెడతారంటూ మాట్లాడుతున్నారు. అంటే.. ‘ఆంధ్రజ్యోతి’ రద్దు కోసం వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలా? అది పెద్ద స్కీమా? ఇదేనా వైసీపీ మ్యానిఫెస్టో?’ అంటూ చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘మగాళ్లయితే రండి’ అంటూ వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి బీరాలు పలుకుతున్నారని, మరి నాడు పోలీసుల నుంచి తప్పించుకొని 141 రోజులు చింతామణిలో ఎందుకు దాక్కున్నావంటూ ఎద్దేవా చేశారు. నకిలీ డాక్యుమెంట్ల కేసులో కూడా పారిపోయిన కాకాణి కూడా ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ‘అక్రమ కేసులు పెడతాం.. స్టేషన్ల చుట్టూ తిప్పుతాం అంటూ బెదిరిస్తున్నారు. జగన్‌కు కేసులు పెట్టడం ఏమీ కొత్త కాదు. అధికారంలో ఉన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’పై అనేక కేసులు పెట్టారు. కానీ ఏం సాధించారు? రాధాకృష్ణ తప్పు రాయకపోయినా రాద్ధాంతం చేస్తున్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు కాకాణి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా మాట్లాడిన మాటలకు వారిని ఏం చేయాలి? జగన్‌ మావిగన్‌ ప్రతిపాదనలపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’పై బెదిరింపులకు దిగుతున్న వైసీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి’ అంటూ సోమిరెడ్డి అన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 03:21 AM