‘సోలార్’తో జేబుకు చిల్లు!
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:41 AM
‘‘సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయండి.. కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోండి.. నెలనెలా ఆదాయం పొందండి...’’ అని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో గృహ వినియోగదారులతోపాటు..
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ వినియోగదారుడు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్లాంట్ ద్వారా గత నెలలో 1,267 యూనిట్లు ఉత్పత్తి చేసి, 1,468 యూనిట్లు వినియోగించుకున్నారు. దీని ప్రకారం ఆయన అదనంగా వాడుకున్న 201 యూనిట్లకు బిల్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఏపీసీపీడీసీఎల్ అధికారులు మాత్రం ఆయన వాడిన మొత్తం 1,468 యూనిట్లకు ఒక్కో యూనిట్ రూ.11.34 చొప్పున లెక్కించి, ఇతర అన్ని చార్జీలు కలిపి రూ.17,310 బిల్లు చూపించారు. దీనిలో సొలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.09 చొప్పున లెక్కించి బిల్లులో సొలార్ సర్దుబాటు కింద రూ.2,464 చూపించారు. మొత్తంగా రూ.14,846 బిల్లు వసూలు చేశారు.
ఈస్ట్రన్ పవర్ సంస్థ పరిధిలోని ఎం. నాగులపల్లిలో ఒక వినియోగదారుడు తాను ఏర్పాటు చేసుకున్న సొలార్ ప్లాంట్ ద్వారా 2,160 యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా 1,580 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నారు. వాడుకున్న విద్యుత్ పోను మిగతా 580 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.09 చొప్పున రూ.1,212 వినియోగదారుని ఖాతాలో చూపించారు. ఫిక్స్‌డ్ చార్జీలు, ఇతరాలు కలుపుకొని రూ.2,688గా బిల్లు చూపించారు. ఈ మొత్తం నుంచి వినియోగదారునికి చెల్లించాల్సిన రూ.1,212 తీసివేసి రూ.1,475 వసూలు చేశారు.
వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న సీపీడీసీఎల్
వారు వాడుకున్న యూనిట్లకు రూ.11.34 చొప్పున బిల్లు
ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తుకు యూనిట్ రూ.2.09కే
నెట్ మీటరింగ్ అమలు చేయకుండా అడ్డగోలుగా దోపిడీ
రూ.వేలల్లో బిల్లులు రావడంపై వినియోగదారుల ఆవేదన
(నరసరావుపేట-ఆంధ్రజ్యోతి)
‘‘సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయండి.. కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోండి.. నెలనెలా ఆదాయం పొందండి...’’ అని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో గృహ వినియోగదారులతోపాటు వ్యాపార, విద్య, వాణిజ్య సంస్థలు సోలార్ యూనిట్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. రూ.లక్షలు వెచ్చించి ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ఏమాత్రం లబ్ధి చేకూరడంలేదు. తాము ఉత్పత్తి చేసే విద్యుత్‌కు ఒక రేటు.. వినియోగించుకొనే విద్యుత్‌కు మరో రేటు నిర్ణయించి బిల్లులు వసూలు చేస్తుండటంపై తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి యూనిట్‌లు ఏర్పాటు చేసుకున్నా ప్రయోజనం లేదని, ప్రతి నెలా రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నెట్ మీటరింగ్ అంటే...
నెట్ మీటరింగ్ అనేది విద్యుత్ బిల్లింగ్ విధానం. దీనిద్వారా సౌరశక్తి వ్యవస్థల యజమానులు, తాము యుటిలిటీ గ్రిడ్‌కు ఎగుమతి చేసిన అదనపు విద్యుత్‌కు క్రెడిట్‌లను పొందవచ్చు. ఈ వ్యవస్థలో బై-డైరెక్షనల్ మీటర్‌ను ఉపయోగించి సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్, గ్రిడ్ నుంచి తీసుకున్న విద్యుత్ మధ్య వ్యత్యాసాన్ని లెక్కిస్తారు. వినియోగదారులు తమ విద్యుత్ వినియోగాన్ని క్రెడిట్‌లతో సర్దుబాటు చేసుకొని, బిల్లులను గణనీయంగా తగ్గించుకొనే అవకాశం ఉంటుంది. సోలార్ ప్యానెళ్లు పగటిపూట గృహావసరాల కంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ అదనపు విద్యుత్తు గ్రిడ్‌కు వెళ్తుంది. రాత్రిపూట, వినియోగదారు ఇంతకుముందు సంపాదించిన క్రెడిట్‌లను ఉపయోగించి గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకుంటారు. మొత్తం విద్యుత్ వినియోగానికి బిల్లు చెల్లించే బదులుగా, వినియోగదారులకు వారి ‘నికర’ విద్యుత్తు వినియోగానికి (వినియోగించిన విద్యు త్తు మైనస్ ఉత్పత్తి చేసిన విద్యుత్తు) మాత్రమే బిల్లు వేస్తారు. నెట్ మీటరింగ్ వినియోగదారులకు గణనీయమైన ప్రయోజనాలు అం దిస్తుంది. ఈ విధానంలో సౌర పెట్టుబడులపై త క్కువ కాలంలోనే రాబడి రావడంతో పాటు విద్యు త్ బిల్లులు 50 నుంచి 100 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
ఒకే రాష్ట్రం.. రెండు విధానాలు
సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీడీసీఎల్) చుక్కలు చూపిస్తోంది. నెట్ మీటరింగ్ విధానం అమలు చేయకుండా ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తోంది. ఈపీడీసీఎల్ పరిధిలో ఈ విధానం పక్కాగా అమలవుతుండటం గమనార్హం. ఒకే రాష్ట్రంలో రెండు విధానాలు ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీపీడీసీఎల్ పరిధిలో కూడా నెట్ మీటరింగ్ విధానం అమలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.