మట్టి మాఫియా బరితెగింపు
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:13 AM
మట్టి మాఫియా బరితెగించింది. కొత్తూరు తాడేపల్లి దగ్గర పోలవరం కాల్వగట్టుపై అక్రమంగా తవ్వకాలు చేపట్టింది. ఇచ్చిన అనుమతులకు భిన్నంగా తవ్వారని అనుమతులను రద్దు చేసినా.. ప్రభుత్వ స్థలంలో తవ్వకాలు చేయవద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. పోలవరం కుడి కాల్వపై జరుగుతున్న ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని తెలిసినా సరే.. అక్రమార్కులు భయపడే ప్రసక్తి లేదంటున్నారు. దమ్ముంటే అడ్డుకోమని సవాల్ విసురుతున్నారు.
- పోలవరం కుడి కాల్వపై యథేచ్ఛగా తవ్వకాలు
- 2 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టారు
- పాక్షిక అనుమతులు రద్దు చేసినా.. హెచ్చరిక బోర్డు పెట్టినా లెక్కచేయని వైనం
- అక్రమార్కులతో పీఐపీఎంఆర్‌సీ అధికారులకు వాటాల డీల్!
- జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్
మట్టి మాఫియా బరితెగించింది. కొత్తూరు తాడేపల్లి దగ్గర పోలవరం కాల్వగట్టుపై అక్రమంగా తవ్వకాలు చేపట్టింది. ఇచ్చిన అనుమతులకు భిన్నంగా తవ్వారని అనుమతులను రద్దు చేసినా.. ప్రభుత్వ స్థలంలో తవ్వకాలు చేయవద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. పోలవరం కుడి కాల్వపై జరుగుతున్న ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని తెలిసినా సరే.. అక్రమార్కులు భయపడే ప్రసక్తి లేదంటున్నారు. దమ్ముంటే అడ్డుకోమని సవాల్ విసురుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కొత్తూరు తాడేపల్లి దగ్గర పోలవరం కుడి కాల్వగట్టుపై మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తమను అడ్డుకునేది ఎవరన్నట్టు మాఫియా రెచ్చిపోతోంది. లారీల్లో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటుంది. వివరాల్లోకి వెళితే... పోలవరం కుడి కాల్వగట్టుపై అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయాలని గతంలో ఇచ్చిన పాక్షిక అనుమతులను కూడా పీఐపీఆర్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ సుబాన్ మార్చి 5వ తేదీన రద్దు చేశారు. తక్షణం తవ్వకాలను నిలుపుదల చేయాలని ఈఈ ఆదేశించి నెల రోజులు దాటిపోయినా కూడా పోలవరం కాల్వ గట్టును చెరపట్టిన అక్రమార్కులు ఇప్పటికీ తవ్వకాలు ఆపటం లేదు. అక్రమ తవ్వకాలు తక్షణం ఆపివేయాలని నోటీసులు ఇచ్చిన నెల రోజుల్లో అనేక సార్లు కలెక్టరేట్‌కు స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా పీఐపీఆర్‌ఎంసీ అధికారులను ఆదేశించటం.. వారు సరేననటం పరిపాటిగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పూచిక పుల్లగా తీసిపారవేస్తూ.. క్షేత్ర స్థాయిలో కనీస చర్యలు కూడా పీఐపీఆర్‌ఎంసీ అధికారులు తీసుకోవటంలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాలపై లోకాయుక్తలో కేసు కూడా నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అయినా కూడా నిర్భయంగా అక్రమార్కులు కాల్వను తవ్వేస్తున్నారు.
2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కుడి కాల్వ గట్టుపై 167.000 కిలోమీటరు నుంచి 167.040 కిలోమీటరు వరకు 10 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు అనుమతుల కోసం ఓ సంస్థ పేరుతో దరఖాస్తు చేసుకోగా.. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కుడి కాల్వ (పీఐపీఆర్‌ఎంసీ) అధికారులు 4,998 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల మేరకు వారం రోజుల్లోనే తవ్వేసిన అక్రమార్కులు.. దీని ముసుగులో తవ్వుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది. దాదాపుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ తవ్వకాలు జరిపారు. ఐదు వేల మెట్రిక్ టన్నులకు అనుమతి ఇస్తే.. 2 లక్షల మెట్రిక్ టన్నులు తవ్వటం చూస్తుంటే.. ఎంత భారీగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది.
హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేరు..
కొత్తూరు తాడేపల్లిలో 167 కిలోమీటర్ దగ్గర జరుగుతున్న అక్రమ మట్ట తవ్వకాల నేపథ్యంలో పీఐపీఆర్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. తమ పరిధిలో ఎక్కడ అక్రమార్కులు తవ్వకాలు జరుపుతారోనన్న భయంతో.. కాల్వ వెంబడి ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కొత్తూరు తాడేపల్లి పరిధిలోని పోలవరం కాల్వ మట్టిని బుడమేరు పనుల కోసం కేటాయించటం జరిగిందని.. అతిక్రమించిన వారు శిక్షార్హులు అంటూ .. అందులో పేర్కొన్నారు. ఈ బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం తవ్వుతున్న దగ్గర బోర్డు పెడితేనే.. అక్రమార్కులు ఆగలేదు. ఆ బోర్డు ఎక్కడ పడేశారో కూడా తెలియదు.
చదును చేసిన భూమినైనా ఉంచుతారా?
పోలవరం కుడి కాల్వ 167వ కిలోమీటరు దగ్గర అక్రమార్కులు దాదాపుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో మట్టి తవ్వకాలు జరిపారు. ఇంకా జరుపుతున్నారు. అక్రమ తవ్వకాలు ఆగటం లేదు. వ్యవస్థలన్నీ నిద్రపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు ఎకరాల్లో మట్టిని తవ్వి చదును చేశారు. మట్టని ఎలాగూ తవ్వుకుపోయారు. ప్రభుత్వ భూమి అయినా మిగులుతుందా అన్న అనుమానం కలుగుతోంది. చదును చేసిన భూమిని ఎవరికైనా స్వాధీనం చేస్తున్నారా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పీఐపీఆర్‌ఎంసీ ఉన్నతాధికారులకు వాటాలు!
పోలవరం కుడి కాల్వ గట్టుపై జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కుడి కాల్వ (పీఐపీఆర్‌ఎంసీ) అధికారులు చర్యలు తీసుకోకపోవటం వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. అక్రమంగా మట్టి తవ్వుకోవటానికి పీఐపీఆర్‌ఎంసీ అధికారులు అక్రమార్కుల నుంచి వాటాలు పొందుతున్నట్టు సమాచారం. అక్రమార్కులు తవ్విన మట్టిన బయటకు తరలించి అమ్మగా వచ్చిన సొమ్ములో వీరికి రోజువారీగా వాటాలు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విజిలెన్స్, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగితే ఈ వాటాల లెక్క ఎంతన్నది వెలుగు చూసే అవకాశం ఉంది.