ప్రాణం మీదకు తెచ్చిన సోషల్ మీడియా వంటకం
ABN , Publish Date - May 05 , 2026 | 06:31 AM
సోషల్ మీడియాలో వచ్చిన ఒక వంటకం ఒక కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. మిగిలిన ఆకు కూరల్లానే ఉమ్మెత్త పువ్వుతో కూర వండుకుని తింటే ఆరోగ్య మని..
పప్పు-ఉమ్మెత్తపువ్వు కూర తిని నలుగురు ఆస్పత్రిపాలు
గండేపల్లి, మే 4(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో వచ్చిన ఒక వంటకం ఒక కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. మిగిలిన ఆకు కూరల్లానే ఉమ్మెత్త పువ్వుతో కూర వండుకుని తింటే ఆరోగ్య మని ఇటీవల సోషల్ మీడియాలో ఒక వంటకం గురించి వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన బిక్కిన గంగాభవాని కుటుంబీకులు చూశారు. అదే రీతిలో సోమవారం ఉమ్మెత్త పువ్వును పప్పులో వేసుకుని కూర వండుకున్నారు. అనంతరం భోజనంలో కలుపుకొని బిక్కిన గంగాభవాని, ముత్యాల వీరలక్ష్మి, బిక్కిన వీరబ్బు, రిమ్మలపూడి జయలక్ష్మి తిన్నారు. ఆ కూర తిన్న కాసేపటికే కుటుంబీకులంతా అస్వస్థతకు గురయ్యారు. నలుగురూ తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయట పడినట్టు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. ఉమ్మెత్త పువ్వు సహజంగానే తీవ్రమైన విషపూరిత గుణాలు కలిగి ఉంటుందని, దీనికి ప్రత్యేకమైన విరుగుడు ఉండదని, శరీరంలో విష ప్రభావం పెరిగితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు తెలిపారు.