Share News

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి!

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:06 AM

సోషల్‌ మీడియా యాంటీ సోషల్‌ మీడియాగా మారిపోయిందని, ముఖ్యంగా యువత దానికి దూరంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు.

సోషల్‌ మీడియాకు దూరంగా ఉండండి!

  • అది యాంటీ సోషల్‌ మీడియాగా మారిపోయింది

  • అసంబద్ధమైన వార్తల వ్యాప్తి.. నేనూ బాధితుడినే

  • యువతకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన

విజయవాడ(బెంజ్‌సర్కిల్‌), జనవరి 23(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా యాంటీ సోషల్‌ మీడియాగా మారిపోయిందని, ముఖ్యంగా యువత దానికి దూరంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. సోషల్‌ మీడియాలో నిజానిజాలు తెలియకుండా అసంబద్ధమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా సోషల్‌ మీడియా బాధితుడినేనని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో సమయం ఎంతో లేదని, రాజధాని విషయంలో త్వరితగతిన పూర్తి చేయాలని అన్నానని.. కానీ, సోషల్‌ మీడియాలో ‘‘చంద్రబాబును చెండాడిన వెంకయ్యనాయుడు’’ అంటూ హెడ్డింగ్‌ పెట్టారని ఆయన తెలిపారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు అయిన సందర్భంగా శుక్రవారం విజయవాడ పటమటలంకలోని కృష్ణవేణి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. తొలుత దాడిలో వీరమరణం పొందిన వారికి నివాళులర్పించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌పై దాడిని మన ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణించారు. మాతృభాష తర్వాతే మరే ఇతర భాష అయిన నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వై.లక్ష్మీప్రసాద్‌, చిగురుపాటి వరప్రసాద్‌, మాజీ డీజీపీ మన్నం మాలకొండయ్య, సాహిత్యవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 06:07 AM