ఇక మదనపల్లె పోలీసుల వంతు
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:36 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో పులివెందుల పోలీసుల విచారణను ఎదుర్కొన్న వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి..
వారి ముందు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
సీఎం భార్య భువనేశ్వరి, మంత్రి అనితపై అసభ్య పోస్టుల కేసులో విచారణ
పొంతన లేని సమాధానాలిచ్చిన భార్గవ్‌రెడ్డి
ఆ పోస్టులు పెట్టింది వర్రా రవీంద్రే!
నాకెలాంటి సంబంధమూ లేదు
పులివెందుల పోలీసుల విచారణలో భార్గవ్
అన్నమయ్య, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో పులివెందుల పోలీసుల విచారణను ఎదుర్కొన్న వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి.. సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసుల ముందుకు వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, హోం మంత్రి అనితలపై పెట్టిన అసభ్యకర పోస్టులపై స్థానిక టీడీపీ నేత చాకన రాజా ఫిర్యాదు మేరకు బి.కొత్తకోట పోలీసు స్టేషన్‌లో 2024లో భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం ఉదయం 10గంటలకు ఆయన బి.కొత్తకోట వెళ్లారు. అయితే విచారణ మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అని తెలియడంతో 11.30కు మదనపల్లె చేరుకున్నారు. డీఎస్పీ పావని ఆధ్వర్యంలో సీఐలు గోపాల్‌రెడ్డి, దస్తగిరి, రఫీ ఆయన్ను ప్రశ్నించారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7 వరకు నాలుగున్నర గంటలపాటు విచారణ సాగింది. ‘2022 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫోన్లు మార్చారు? ఎన్ని సిమ్ కార్డులు ఉపయోగించారు? భార్య, పిల్లల పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? ఎన్ని సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్నారు? ఇడ్లీ సాంబార్ సోషల్‌మీడియా ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారు? జగతి పబ్లికేషన్‌తో మీకు సంబంధమేంటి’ ..మొదలైన ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయన పొంతన లేని జవాబులు చెప్పినట్లు తెలిసింది. మంగళవారం కూడా రావాలని చెప్పగా.. తన మోకాలికి ఆపరేషన్ జరిగిందని ఆయన తెలిపారు. దీంతో వచ్చే నెల 5, 6 తేదీల్లో రావాలని పోలీసులు సూచించారు.
ఆ పోస్టులు పెట్టింది వర్రా రవీంద్రే!
పులివెందుల పోలీసుల విచారణలో భార్గవ్‌రెడ్డి
పులివెందుల, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబసభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిలపై అసభ్యకర పోస్టులు పెట్టింది వర్రా రవీంద్రరెడ్డేనని సజ్జల భార్గవ్‌రెడ్డి విచారణలో వెల్లడించారు. ఆ పోస్టులకు, తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ బృందం శని, ఆదివారాల్లో ఆయన్ను పులివెందులలో సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రశ్నించారు. వర్రా రవీంద్రరెడ్డి స్టేట్‌మెంట్లను, పలు ఆధారాలను ముందుంచి అడుగగా.. భార్గవ్‌రెడ్డి ఎట్టకేలకు స్పందించినట్లు తెలిసింది. నాడు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి తాను కన్వీనర్‌గా ఉన్నప్పటికీ.. తమ విభాగానికి చెందినవారు కొన్ని పోస్టులను వ్యక్తిగతంగా పెడుతుంటారని చెప్పినట్లు సమాచారం. వారం రోజుల్లో మరోసారి ఆయన విచారణకు వస్తారని డీఎస్పీ మీడియాకు తెలిపారు. అది ఎప్పుడన్నది రెండ్రోజుల ముందు నోటీసులిస్తామన్నారు.