Share News

నిద్రమత్తా.. బ్రేక్‌ ఫెయిలా!?

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:19 AM

కీసర టోల్‌ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఏమిటి? ప్లాజా సమీపిస్తున్న సమయంలో డ్రైవర్‌ కంటి మీద రెప్ప వాల్చాడా? టోల్‌ బూతకు ముందు ఉన్న ప్రదేశం వల్ల ట్యాంకర్‌ను నియంత్రించలేకపోయాడా? బ్రేక్‌ వేసినా అది పనిచేయలేదా? ఇవీ తాజాగా ఉదయిస్తున్న ప్రశ్నలు. కీసర టోల్‌ప్లాజా వద్ద సిమెంట్‌ ఫ్లైయాష్‌ ట్యాంకర్‌ తిరగబడటంతో బీఎండబ్ల్యూ కారులో ఉన్న న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

నిద్రమత్తా.. బ్రేక్‌ ఫెయిలా!?

‘కీసర’ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు

సాధారణ స్థితిలోనే ఉన్న డ్రైవర్‌

నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గుర్తించిన పోలీసులు

డ్రైవర్‌ను కోర్టులో హాజరుపరచనున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

కీసర టోల్‌ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఏమిటి? ప్లాజా సమీపిస్తున్న సమయంలో డ్రైవర్‌ కంటి మీద రెప్ప వాల్చాడా? టోల్‌ బూతకు ముందు ఉన్న ప్రదేశం వల్ల ట్యాంకర్‌ను నియంత్రించలేకపోయాడా? బ్రేక్‌ వేసినా అది పనిచేయలేదా? ఇవీ తాజాగా ఉదయిస్తున్న ప్రశ్నలు. కీసర టోల్‌ప్లాజా వద్ద సిమెంట్‌ ఫ్లైయాష్‌ ట్యాంకర్‌ తిరగబడటంతో బీఎండబ్ల్యూ కారులో ఉన్న న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు. ప్రమాదం పెద్దదే అయినా, ప్రాణనష్టం ఆ స్థాయిలో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మొత్తం ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని రెండు శాఖల అధికారులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తీరును విశ్లేషిస్తూ అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

సాధారణ వేగంతోనే రాక

టోల్‌ప్లాజా వద్ద మూడో లైన్‌లోకి ట్యాంకర్‌ డ్రైవర్‌ ఆంటోని జేవియర్‌ సాధారణ వేగంతోనే వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. టోల్‌ప్లాజా సమీపిస్తున్న సమయానికి అతడు 30-40 కిలోమీటర్ల వేగంతో ట్యాంకర్‌ను నడుపుతున్నట్టు నిర్ధారించారు. వేగం తక్కువగా ఉన్నప్పటికీ భారీ ప్రమాదం జరగడానికి డ్రైవర్‌ తప్పిదాలు చేశాడని అనుమానిస్తున్నారు. రెండో లైన్‌లోకి వెళ్లాలా, మూడో లైన్‌లోకి వెళ్లాలా అన్న గందరగోళంలో ఈ ప్రమాదం చేశాడని తొలుత అనుమానించారు. డ్రైవర్‌ ఎలాంటి గందరగోళం లేకుండా మూడో లైన్‌లోకి వచ్చినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఆ సమయంలో వేగం సాధారణంగా ఉన్నట్టు గమనించారు. మరికొద్దిసేపట్లో టోల్‌బూత వద్దకు వెళ్తాననే సరికి డ్రైవర్‌ కంటి మీద రెప్ప వాల్చినట్టు అనుమానిస్తున్నారు. ఇదంతా సెకన్ల సమయంలో జరిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. సరిగ్గా రెప్ప తెరిచే సరికి ఎదురుగా కారులు ఆగి ఉండడంతో సిమెంట్‌ దిమ్మను కావాలని ఢీ కొట్టినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిన్నగా వస్తే ముందున్న కారులన్నీ ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోతాయి. దీని వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని డ్రైవర్‌ భావించినట్టు సమాచారం. అదే సిమెంట్‌ దిమ్మను ఢీకొడితే అక్కడే ఆగిపోతుందని ఆలోచించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

నియంత్రణలోకి రాలేదు

పోలీసులు శనివారం రాత్రి నుంచి డ్రైవర్‌ ఆంటోని జేవియర్‌ను విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని ముందుగా డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేశారు. అతడు సాధారణ స్థితిలోనే ఉన్నాడు. మూడో లైన్‌లోకి రావాలని ముందుగా నిర్దేశించుకున్న తర్వాత ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు అతడిని ప్రశ్నించారు. టోల్‌బూతకు ముందు ప్రదేశం లోతుగా ఉందని, దాని వల్ల ట్యాంకర్‌ నియంత్రణలోకి రాలేదని చెప్పాడు. దీన్ని బట్టి బ్రేకులు విఫలమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు ట్యాంకర్‌ను పరిశీలించిన తర్వాత బ్రేకులు పనిచేశాయా లేదా అన్న విషయం నిర్ధారణ అవుతుంది.

సిమెంట్‌ దిమ్మలను ఢీకొట్టకుంటే...

టోల్‌బూత వద్ద న్యాయవాది శ్రీనివాసరావు కారుకు ముందు మరో రెండు కారులు ఆగి ఉన్నాయి. అంటే ట్యాంకర్‌ ముందు మూడు కారులు ఆగి ఉన్నాయి. ట్యాంకర్‌ తన నియంత్రణలోకి రాకపోవడంతో సిమెంట్‌ దిమ్మను ఢీ కొట్టానని డ్రైవర్‌ ఆంటోని జేవియర్‌ చెబుతున్నాడు. అదే సిమెంట్‌ దిమ్మను ఢీకొట్టకుండా ఉంటే ముందున్న మూడు కారులను ఢీ కొట్టినా న్యాయవాది ప్రాణాలతో బయటపడే వారని కొంతమంది చెబుతున్నారు. బీఎండబ్ల్యూ కారుకు ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్‌ తెరుచుకుంటుంది. ట్యాంకర్‌ ముందున్న న్యాయవాది కారును ఢీకొట్టి ఉంటే అది దాని ముందున్న కారును ఢీ కొట్టేది. న్యాయవాది కారుకు ముందు ఆగి ఉన్న రెండు కారులు హైఎండ్‌ కారులేనని పోలీసులు చెబుతున్నారు. ఈ మూడు కారులు ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టుకున్నా ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకోవడం ప్రాణనష్టం ఉండేది కాదని డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నవారు అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్‌ ఆంటోని జేవియర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచబోతున్నారు.

Updated Date - Apr 13 , 2026 | 12:19 AM