ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:27 AM
రాష్ట్రంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. ఆదివారం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ400కు చేరింది. బ్రాయిలర్ కోళ్ల ఉత్పాదకత తగ్గడం, రంజాన్ మాసం, ఫంక్షన్ల కారణంగా చికెన్‌కు ఊహించని డిమాండ్ ఏర్పడింది.
స్కిన్‌లెస్ కోడిమాంసం కిలో రూ.400
పెద్ద బ్రాయిలర్ కూడా రూ.300పైనే
బెంబేలెత్తుతున్న వినియోగదారులు
రంజాన్, ఫంక్షన్ల వల్ల పెరిగిన డిమాండ్
పౌల్ట్రీలో ఒక్కసారిగా తగ్గిన ఉత్పత్తి
మరోవైపు గుడ్డు ధర నేల చూపులు..
చెన్నై నుంచి గల్ఫ్ దేశాలకు ఆగిన ఎగుమతి
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
రాష్ట్రంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. ఆదివారం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ400కు చేరింది. బ్రాయిలర్ కోళ్ల ఉత్పాదకత తగ్గడం, రంజాన్ మాసం, ఫంక్షన్ల కారణంగా చికెన్‌కు ఊహించని డిమాండ్ ఏర్పడింది. దీంతో చికెన్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నెల 1వ తేదీన 340 (స్కిన్), 350 (స్కిన్‌లెస్)గా ఉన్న ధర.. ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ వచ్చింది. గత ఆదివారం (మార్చి 15) కూడా 370 (స్కిన్), 380 (స్కిన్‌లెస్) పలికింది. కృత్రిమ కొరత సృష్టించి దండుకోవడానికి అసోసియేషన్ వేసిన ప్లాన్ ఇదని వినియోగదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదే మీ లేదని ఉత్పాదకత లేక ధరలు పెరిగాయని అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. నెల క్రితం కిలో రూ.300లోపు ఉన్న చిన్న బ్రాయిలర్ వారానికి రూ.20చొప్పున పెరుగుతూ వచ్చి ఆదివారం ఏకంగా రూ.400 (స్కిన్‌లెస్)కు చేరుకుంది. విత్ స్కిన్ (డ్రెస్స్‌డ్) ధర రూ.390 పలికింది. డిమాండ్‌కు సరిపడా చిన్న బ్రాయిలర్ కోళ్లు లభించకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని చికెన్ దుకాణాల నిర్వాహకులు అంటున్నారు. ఆదివారం పెద్ద బ్రాయిలర్ కూడా కిలో రూ.300 పలికింది. చికెన్ ధర రూ.400కు చేరడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు కూడా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. కోళ్ల ఫారం నిర్వాహకులు పిల్లల పెంపకం ఆపేడయంతో పాటు ఫారంలో పెంచుతున్న కోళ్లు పెద్దఎత్తున మృతి చెందుతున్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక రేటు అమాంతం పెరిగిపోయింది.
బ్రాయిలర్ కోళ్లకు కటకట
జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకు కోళ్లు వచ్చేవి. అయితే ఆ ప్రాంతాల్లో కోళ్ల ఉత్పత్తి లేక విశాఖపట్నం, తెలంగాణ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ధరలు పెరిగాయి. వేసవి రావడంతో వ్యాపారులు కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు. ఫారాల్లో వంద కోళ్ల ఉత్పత్తి రావాల్సిన చోట 40, 50 కోళ్లు మాత్రమే వస్తున్నాయని, ఎండ తీవ్రతకు కొన్ని చనిపోతున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు రంజాన్ మాసంలో హలీం, ఇతర మాంసాహార వంటల కోసం పెద్ద ఎత్తున సరఫరా జరిగింది. ఆ స్థాయిలో ఉత్పాదకత లేకపోవడంతో కోళ్లకు కొరత వచ్చింది.
తగ్గుతున్న గుడ్డు ధరలు
ఓ వైపు చికెన్ ధరలు ఆకాశాన్నంటుతుంటే.. కోడి గుడ్డు ధర మాత్రం పడిపోతోతూ వస్తోంది. మొన్నటి వరకు రూ.8 అమ్మిన కోడిగుడ్డు ధర పతనమై రూ.4.65కు చేరింది. దీంతో సాధారణ పౌల్ర్టీ యజమానులు విలవిల్లాడుతున్నారు. కోడిగుడ్లు ఎక్స్‌పోర్టు లేకపోవడంతో ధరలు పడిపోయాయి. తమిళనాడుకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం యుద్ధం కారణంగా గల్ఫ్‌కు ఎగుమతులు జరగట్లేదు.