ఈ ఏడాది వర్షాలు తక్కువే
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:00 AM
దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపనుంది. నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అత్యంత కీలకమైన రెండో భాగం అంటే ఆగస్టు....
ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా
ఐఎండీ బులెటిన్ ఈ నెలాఖరులో విడుదల
విశాఖపట్నం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపనుంది. నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అత్యంత కీలకమైన రెండో భాగం అంటే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఎక్కువ రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని, మరికొన్నిచోట్ల ఎక్కువ వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బులెటిన్ విడుదల చేసింది. సాధారణంగా భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ఏప్రిల్ రెండు, మూడు వారాల మధ్య నైరుతి రుతుపవనాలపై ముందస్తు అంచనా నివేదిక విడుదల చేస్తుంది. దాని కంటే ముందే స్కైమెట్ బులెటిన్ విడుదల చేసింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు దీర్ఘకాలిక సగటులో 94 శాతం వర్షపాతం కురుస్తుందని పేర్కొంది. ఈ సీజన్‌లో దేశంలో 868.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే, 817 మిల్లీమీటర్లు, లేదా దానికి 5 శాతం ఎక్కువగానీ, 5 శాతం తక్కువగానీ నమోదవ్వొచ్చని స్కైమెట్ అంచనా వేసింది. జూన్, జూలై ల్లో సంతృప్తికరంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాధారణంగా జూన్‌లో 165.3 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే, ఆ నెలలో దీర్ఘకాలిక సగటులో 101 శాతం వర్షపాతం నమోదు కానుందని స్కైమెట్ తెలిపింది. జూలైలో 280.5 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. కానీ దీర్ఘకాలిక సగటులో 95 శాతం కురుస్తుందని అంచనా వేసింది. ఆగస్టులో 254.9 మిమీ వర్షం కురవాల్సి ఉండగా 92 శాతం.. సెప్టెంబరులో 167.9 మిల్లీమీటర్లకుగాను అందులో 89 శాతం వర్షం కురుస్తుందని అంచనావేసింది. ఇదిలావుండగా పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి క్రమేపీ ఎల్‌నినో దిశగా మార్పు చెందనున్నాయి. జూన్, జూలై నాటికి ఎల్‌నినోగా మారుతుంది. తర్వాత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో బలపడుతుంది. దీనివల్ల పసిఫిక్ నుంచి వచ్చే రుతుపవన గాలులు బలహీనంగా మారనున్నాయి. హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్(ఐవోడీ) ప్రస్తుతం నెగెటివ్‌గా ఉన్నప్పటికీ ఆగస్టు, సెప్టెంబరు నాటికి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. ఐవోడీ మరింత బలంగా మారితే ఎల్‌నినోపై ఆధిపత్యం కొనసాగి వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, అలాగని ఎల్‌నినో ప్రభావాన్ని తక్కువగా చూపలేమని స్కైమెట్ పేర్కొంది.