కల్యాణదుర్గంలో స్కై ఫ్యాక్టరీ!
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:09 AM
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. కల్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో రూ.1,300 కోట్లతో ఎలక్ర్టిక్ వర్టికల్ టేకాఫ్...
ఎలక్ర్టిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు
1,300 కోట్ల పెట్టుబడితో.. 500 ఎకరాల్లో.. సర్లా ఏవియేషన్ సంస్థ సన్నాహాలు
అనంతపురం జనవరి 20(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. కల్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో రూ.1,300 కోట్లతో ఎలక్ర్టిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సర్లా ఏవియేషన్ ముందుకొచ్చింది. ఆ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ విమానాల తయారీ కర్మాగారానికి స్కై ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. ప్రాజెక్టు మొదటి దశలో 150 ఎకరాల్లో రూ.330 కోట్ల పెట్టుబడితో మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. 2029 నాటికి పూర్తిస్థాయిలో పరిశ్రమను నెలకొల్పాలని ఆ సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఏడాదికి 1,000 ఎయిర్‌క్రా్‌ఫ్టలు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. దీనిద్వారా పట్టణ వాయు రవాణాకు ఒక పూర్తిస్థాయి వ్యవస్థను నెలకొల్పాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ పరిశ్రమ క్యాంప్‌సలో అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ సెంటర్లు, ల్యాబ్‌లు, విమాన టెస్టింగ్ సౌకర్యాలు, 2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేలు నిర్మించనున్నారు. ఇక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి సర్లా ఏవియేషన్ ఇప్పటికే బెంగుళూరులో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. ఈవీటీవోఎల్ ఎయిర్‌క్రా్‌ఫ్టల తయారీ ద్వారా వాణిజ్య ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరు సీట్లు ఉండే ఈ విమానాలు ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల దూరం, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిద్వారా మెట్రో పాలిటన్ నగరాలు, విమానాశ్రయాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది.
చంద్రబాబు విజన్‌కు నిదర్శనం: ఎమ్మెల్యే అమిలినేని
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని, ఆయన విజన్‌కు తిమ్మసముద్రంలో ఏర్పాటు చేయనున్న ఈవీటీవోఎల్ విమాన తయారీ కేంద్రం నిదర్శనమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఈ కర్మాగారం ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, దీనికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇందులో అర్హత, నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.