ACB Court Verdict: స్కిల్‌లో కేసు నిల్
ABN , Publish Date - Jan 13 , 2026 | 04:56 AM
2014-19 నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు.
ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవు
చంద్రబాబుపై కేసు మూసివేత
మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్
సీఐడీ నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం
వాదనలు వినాలన్న అజయ్‌రెడ్డి పిటిషన్ డిస్మిస్
స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్) సీఐడీ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
విజయవాడ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): 2014-19 నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.3,356 కోట్ల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్ వాటా 90 శాతం, మిగతా పది శాతం ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు (క్రైం నంబరు 29/2021) నమోదు చేసింది. సీమెన్స్ 90 శాతం నిధులను ఈ ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా జరగలేదని.. మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని తెలిపింది. సీమెన్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించకున్నా, దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు రూ.371 కోట్లు విడుదల చేసిందని, ఆ డబ్బులను చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారని సీఐడీ ఆరోపించింది.
ఆయన సహా 37 మందిపై కేసు నమోదు చేసింది. అప్పటి కార్పొరేషన్ ఎండీ గంటా సుబ్బారావు, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్‌టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వల్కర్, పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి ముకుల్ చంద్ర అగర్వాల్, అవకాశిక సంస్థ ప్రతినిధి శిరీష్ చంద్రకాంత్ షా, విపిన్ శర్మ, నీలం శర్మ, సీమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ తదితరులపై ముందుగా కేసు పెట్టారు. తర్వాత చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారమూ లేకున్నా.. ప్రజాగళం యాత్రలో ఆయన నంద్యాలలో ఉన్నప్పుడు 2023 సెప్టెంబరు 9న సీఐడీ అధికారులు అరెస్టు చేసి రాత్రికి రాత్రి వాహనంలో విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన 53 రోజులపాటు.. 2023 అక్టోబరు 31 వరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీఐడీ అధికారులు ఇటీవల ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుతోపాటు మొత్తం 37 మంది నిందితులకు ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. అయితే ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలను వినాలని అజయ్‌రెడ్డి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తానూ ఫిర్యాదుదారునేనని పేర్కొన్నారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు, సీఐడీ తరఫున న్యాయవాదులు ఉన్నం అఖిల్ చౌదరి, కొమర చక్రపాణి.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్ దేశ్‌పాండే వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అజయ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన స్కిల్ కేసు
సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. చంద్రబాబు అరెస్టయిన తొలి కేసు
ఆధారాల్లేకున్నా 53 రోజుల జైలు జీవితం
వైసీపీ ఘోర ఓటమికి అదే ప్రధాన కారణం
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కేసు స్కిల్ డెవల్‌పమెంట్ కేసు. అప్పటికి మూడు సార్లు సీఎంగా చేసినచంద్రబాబు అరెస్టుకు కారణమైన ఈ కేసు 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయానికి.. వైసీపీ ఘోరపరాజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అరెస్టయిన మొదటి కేసు ఇదే. ఇందులో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఒక్క రూపాయైునా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోయినా.. ఆయనపై కక్షతో నాటి జగన్ ప్రభుత్వం అప్పటికి ఎన్నికలు ఏడాది కూడా లేని సమయంలో.. అక్రమంగా స్కిల్ కేసును బనాయించి జైల్లో పెట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు దేశవిదేశాల్లో ఆందోళనలు చేపట్టారు. 53 రోజులు ఆయన జైల్లో ఉన్న కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవించాయి. గతంలో ఎప్పుడూ బయటకు రాని ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో జనంలోకి వచ్చారు. అప్పటి వరకు కలిసి నడవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్.. జైల్లో చంద్రబాబును పరామర్శించి వచ్చాక అక్కడికక్కడే టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసిరావడంతో మూడు పార్టీలూ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడం.. 94 శాతం స్ట్రయిక్ రేటుతో.. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 చోట్ల గెలుపొందడం.. ‘వైనాట్ 175’ అని విర్రవీగిన వైసీపీ 11 స్థానాలకే చతికిలపడిపోవడం.. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయాయి. చంద్రబాబు అరెస్టు వల్లే 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని స్వయంగా వైసీపీ నేతలే అంగీకరిస్తారు.
కళ్లముందే స్కిల్ కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. వేల మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినట్లు రుజువులు ఉన్నా వైసీపీ మాత్రం అడ్డగోలుగా ఈ కేసులో ముందుకెళ్లింది. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలు చేసినా.. ఒక్క షెల్ కంపెనీని కూడా చూపించలేకపోయారు. చంద్రబాబు ఒక్క రూపాయి లబ్ధి పొందినట్లు ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ కారణంగానే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిని 2025 జనవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనపై అభియోగాలు వాస్తవం కానందున ఎట్టకేలకు ఆయనతోపాటు 37 మందిపై విచారణను కోర్టు మూసివేయడంతో.. ఓ సంచలన కేసుకు ముగింపు పలికినట్లయింది.