ఆచూకీ దొరకని మత్స్యకారులు
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:52 AM
విశాఖ తీరానికి పది నాటికల్ మైళ్ల దూరంలో శనివారం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న గాలింపు చర్యలు
రంగంలోకి రెండు కోసు ్టగార్డు నౌకలు
మూడు హెలికాప్టర్లు, నిఘా విమానం
సురక్షితంగా తీరం చేరిన కారి చిన్నా
విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ తీరానికి పది నాటికల్ మైళ్ల దూరంలో శనివారం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయినా సోమవారం రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు. మునిగిపోయిన బోటు జాడ కూడా తెలియలేదు. ఈ నెల 1న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు (ఐఎన్‌డీ-ఏపీ-ఎంఎ-వీఎస్-83) వేట ముగించుకొని తిరిగి తీరానికి వస్తుండగా శనివారం మధ్యాహ్నం సముద్రంలో బలమైన గాలులు, అలల ఉధృతికి బోల్తాపడి మునిగిపోయిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు అందులోనే చిక్కుకుపోగా మిగిలిన ఆరుగురు (విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారి చిన్న, కారి గరగయ్య, అమర అప్పలరాజు, కారి సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెద నాగయ్యపాలేనికి చెందిన రగపతి బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు) రాత్రి తొమ్మిది గంటల వరకు ఈదుకుంటూ తీరం చేరే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరైన బోటు యజమాని కారి చిన్నాని చైనా వాణిజ్య నౌక సిబ్బంది రక్షించింది. కాగా, సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం కోస్టుగార్డు నుంచి కనకలత బారువా, వీర నౌకలు సోమవారం విస్తృతంగా గాలిస్తున్నాయి. తూర్పు నౌకాదళం నుంచి మూడు హెలికాప్టర్లు, నిఘా విమానం పీ8ఐ కూడా సముద్రం పైనుంచి వారి కోసం వెదుకుతున్నాయి. అయితే సోమవారం సాయంత్రం వరకు ఫలితం లభించలేదు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను కోస్టల్ సెక్యూరిటీ ఇన్‌చార్జి ఐజీ గోపీనాథ్ పర్యవేక్షిస్తున్నారు.
సురక్షితంగా తీరానికి చేరిన కారి చిన్నా
సముద్రంలో బోటు మునిగిపోయిన ప్రమాదంలో వాణిజ్య నౌక సిబ్బంది సాయంతో ప్రాణాలు దక్కించుకున్న మత్స్యకారుడు కారి చిన్నా సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. వాణిజ్య నౌకలో ఉన్న చిన్నాను నేవీ అధికారులు హెలికాప్టర్ సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి సోమవారం రాత్రి 7 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు తీసుకువచ్చారు. అక్కడ అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగానే ఉన్నట్టు ధ్రువీకరించారు. కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జట్టీ మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. మునిగిపోయిన బోటు యజమాని చిన్నాయే కావడంతో అతని వద్ద పూర్తి సమాచారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఆచూకీ దొరికే వరకు గాలింపు: విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించేంత వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని ఐజీ గోపినాథ్ జట్టీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సముద్రంలో నాలుగు మీటర్ల ఎత్తైన అలలు, బలమైన గాలుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. అయినా అందుబాటులో ఉన్న అన్ని వనరులతో 72 గంటల సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. కాగా, సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులంతా షిఫింగ్ హార్బర్‌కు చేరుకుని వారి రాక కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. తమ వారిని తలుచుకొని విలపిస్తున్నారు. ఎలాగైనా వారిని రక్షించి తీసుకురావాలని కనిపించిన నాయకులందర్నీ కోరుతున్నారు. ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, తదితరులు హార్బర్‌కు వెళ్లి వారిని పరామర్శించారు.
ఫోన్లు నీటిలో పడిపోయాయి అందుకే సమాచారం ఇవ్వలేకపోయాం: కారి చిన్న
అక్కిరెడ్డిపాలెం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్లు సముద్రంలో పడిపోవడంతో ప్రమాద సమాచారాన్ని అందించలేకపోయామని ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారుడు కారి చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ‘శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు తమ బోటు బోల్తా పడడంతో అంతా సముద్రంలో పడిపోయాం. ఆ సమయంలో తమ సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి నీటిలో పడిపోవడంతో ప్రమాద సమాచారం చేరవేయలేకపోయాం. నీటిలోకి దూకి ఈదడం ప్రారంభించాం. నాతో పాటు మిగిలిన ఆరుగురం కొంతదూరం వచ్చాక దూరమయ్యాం. ఆదివారం ఉదయం వాణిజ్య నౌకను చూసి కేకలు వేయడంతో వారు నన్ను చూసి రక్షించారు.’ అని చిన్నా విలపించాడు.