Share News

ఆరుగురు ‘ఉక్కు’ ఉద్యోగుల సస్పెన్షన్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:40 AM

స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్‌ విభాగంలో గత నెల ఎనిమిదో తేదీన సంభవించిన ప్రమాదానికి బాధ్యులను చేస్తూ యాజమాన్యం గురువారం ఆరుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది.

ఆరుగురు ‘ఉక్కు’ ఉద్యోగుల సస్పెన్షన్‌

  • గత నెల జరిగిన ప్రమాదంపై త్రిసభ్య కమిటీ నివేదిక

  • సస్పెండైనవారిలో సీనియర్‌ మేనేజర్‌, డీజీఎం కేడర్‌ అధికారులు!

విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్‌ విభాగంలో గత నెల ఎనిమిదో తేదీన సంభవించిన ప్రమాదానికి బాధ్యులను చేస్తూ యాజమాన్యం గురువారం ఆరుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది. ఆ రోజు లాడిల్‌లో పేలుడు సంభవించి పది మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అదేరోజు రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంటును సందర్శించి ప్రమాదానికి కారణాలు వెలికితీయడానికి త్రిసభ్య కమిటీని నియమించారు. సెయిల్‌ బొకారో ప్లాంటుకు చెందిన డైరెక్టర్‌ ఇన్‌చార్జి ప్రియా రంజన్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జితేంద్రకుమార్‌, మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గోపాల్‌సింగ్‌లతో కూడిన కమిటీ పదో తేదీన స్టీల్‌ ప్లాంటుకు వచ్చి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. వివిధ వర్గాలతో మాట్లాడి ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా.. ఎస్‌ఎంఎస్‌ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ యాజమాన్యం గురువారం ఆరుగురిని సస్పెండ్‌ చేసింది. వీరిలో సీనియర్‌ మేనేజర్‌, డీజీఎం కేడర్‌ అధికారులు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మృతదేహాల తరలింపులో యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ అప్పట్లో హెచ్‌ఆర్‌ విభాగంలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేసి, మరో ముగ్గురిని బదిలీ చేశారు. లాడిల్‌లో పేలుడుకు నాసిరకం ఫెర్రో అల్లాయిస్‌ కారణమని ఆరోపణలు రావడంతో ఆయా విభాగాలకు చెందిన 22 మందిని యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. ఆ తరువాత సస్పెన్షన్‌ ఎత్తివేసి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, వారిపై విచారణకు ఆదేశించింది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వ తీసుకున్న నిర్ణయాలే కారణమని, వాటిపై కూడా విచారణ చేపట్టాలని ఉక్కు వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కింది స్థాయి వారిని బలి చేయడం అన్యాయమని ఆరోపిస్తున్నాయి.

Updated Date - Jul 03 , 2026 | 05:42 AM