Share News

లిక్కర్‌ స్కామ్‌ ముఖ్య నిందితులకు బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:25 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక నిందితులకు ఉచ్చు బిగుస్తోంది. ఎపీఎ్‌సబీసీఎల్‌ ఎండీగా మొత్తం వ్యవహారం నడిపించిన డి.వాసుదేవ రెడ్డి....

లిక్కర్‌ స్కామ్‌ ముఖ్య నిందితులకు బిగుస్తున్న ఉచ్చు

  • వాసుదేవరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి ప్రాసిక్యూషన్‌కు కేంద్రానికి సిట్‌ లేఖ

  • కుంభకోణం ప్రణాళికల్లో ఇద్దరిదీ కీలకపాత్ర

  • సిట్‌ దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు

  • న్యాయ విచారణకు చురుగ్గా చర్యలు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక నిందితులకు ఉచ్చు బిగుస్తోంది. ఎపీఎ్‌సబీసీఎల్‌ ఎండీగా మొత్తం వ్యవహారం నడిపించిన డి.వాసుదేవ రెడ్డి(ఏ-2), మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వద్ద ఐదేళ్లపాటు అన్ని వ్యవహారాలు చక్కబెట్టిన నాటి సీఎంవో కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌ రెడ్డి(ఏ-31) లిక్కర్‌ స్కామ్‌లో రూపొందించి అమలు చేసిన కుట్రల్ని ఇప్పటికే సిట్‌ వెలికి తీసింది. జైలుకెళ్లి బెయిలుపై విడుదలైన ఆ ఇద్దరిని ప్రాసిక్యూషన్‌ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీంతో సిట్‌ అధికారులు ఇటీవల డీవోపీటీ, రైల్వే శాఖలకు వేర్వేరుగా ఆ ఇద్దరు నిందితుల కోసం లేఖలు రాశారు. ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని 2019కు ముందు పదే పదే చెప్పిన జగన్‌ అధికారంలోకి రాగానే మడమ తిప్పారు. అందుకు ప్రధాన కారణం వేల కోట్ల రూపాయల కుంభకోణం రూపకల్పనేనని తేలింది. అయితే అదంతా ప్రణాళిక ప్రకారం రూపొందించి అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు కె. ధనుంజయ్‌ రెడ్డి, డి.వాసుదేవరెడ్డి అన దర్యాప్తులో తేలింది. కుంభకోణం పక్కాగా అమలు చేసేందుకు ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని వైసీపీ మద్యం ముఠా ఏరికోరి ఏపీ సర్వీసులకు తెచ్చుకున్నట్లు స్పష్టమైంది. మద్యం పాలసీ ఏ విధంగా రూపొందిస్తే వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించవచ్చనే ప్రణాళిక రూపొందించడంలో ఆయనే కీలకం. ఈ స్కామ్‌లో ఏ-1 రాజ్‌ కసిరెడ్డితో పాటు మరికొందరితో పలు దఫాలు చర్చించి పాలసీని అమలు చేశారు. లంచాలు తీసుకుని వాసుదేవరెడ్డి రాష్ట్రంలో ఊరూ పేరు లేని బ్రాండ్లను ప్రోత్సహించారు. ప్రముఖ బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఆయన కుట్రలతో పాటు వసూళ్లు, ఆదాయాన్ని సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ఆధారంగా ఈడీ సైతం వాసుదేవరెడ్డి ఆస్తులు జప్తు చేసింది.


మరోవైపు నాటి ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితంగా ఉంటూ మద్యం డిస్టిల్లరీలు, లిక్కర్‌ సరఫరా యజమానుల నుంచి భారీగా లంచాలు వసూలుకు రూపొందించిన ప్రణాళిక అమలులో ధనుంజయ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం రూపొందించిన ఆటోమేటిక్‌ మద్యం ఆర్డర్లను మాన్యువల్‌ పద్ధతిలోకి మార్చడం, మద్యం ముఠా సిఫారసు చేసిన వ్యక్తుల్ని ఏపీఎ్‌సబీసీఎల్‌లో కీలక స్థానాల్లో నియమించడంలోనూ ఆయన పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయి. తన సాయానికి ప్రతిఫలంగా తీసుకున్న అవినీతి సొమ్ముతో నెల్లూరు జిల్లాలో కుటుంబ సభ్యుల పేరిట భారీగా స్థిరాస్తులు కొన్నట్లు సిట్‌ గుర్తించింది. వాటిపైనా ఈడీ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ భాగోతాలకు పాల్పడిన ఇద్దరు అధికారులకు న్యాయస్థానంలో శిక్ష పడాలంటే అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూషన్‌ తప్పనిసరి కావడంతో సిట్‌ అధికారులు కేంద్రానికి లేఖలు రాశారు. వారి నుంచి అనుమతి రాగానే వీరిద్దరిపై న్యాయవిచారణ మొదలుకానుంది.

Updated Date - Apr 23 , 2026 | 03:25 AM