అక్రమార్జనకు అన్ని విధాలా అండ
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:40 AM
మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా సొమ్ము ఆర్జించేందుకు అప్పటి సీఎం కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి అన్ని విధాలా సహకరించారని సిట్ స్పష్టంచేసింది.
సహ నిందితులకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సహకారం: సిట్
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా సొమ్ము ఆర్జించేందుకు అప్పటి సీఎం కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి అన్ని విధాలా సహకరించారని సిట్ స్పష్టంచేసింది. ఇతర నిందితులకు తోడ్పాటు అందించి ప్రభుత్వ ఖజానాకు రూ.3500 కోట్లు నష్టం చేశారని తెలిపింది. వారిద్దరినీ ఇతర నిందితులతో పోల్చి చూడడానికి వీల్లేదని పేర్కొంది. బెయిల్ నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టు తుది విచారణ ప్రారంభించింది. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఈ ముగ్గురు నిందితుల విషయంలో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేశామని తెలిపారు. ఽసహచర నిందితులందరూ విడుదలయ్యారనే కారణంతో తమకు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు కోరలేరని.. వారికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. వారి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవే, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘ప్రాసిక్యూషన్‌కు అనుమతిలో జాప్యం కారణంగా బెయిల్ నిరాకరించడానికి వీల్లేదు. బెయిల్ మంజూరుచేయండి’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మంగళవారం (28న) తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.