Share News

ఏం జరిగింది?

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:38 AM

విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయి అదృశ్యం కేసులో సిట్‌ అధికారులు కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను విచారించారు.

ఏం జరిగింది?

  • సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్‌ విచారణ

  • సీఐ నాగరాజు వ్యవహారశైలిపై ఆరా

  • రౌడీషీటర్‌ సాయికృష్ణ వివరాలూ సేకరణ

  • విచారణకు హాజరైన డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ

విజయవాడ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయి అదృశ్యం కేసులో సిట్‌ అధికారులు కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను విచారించారు. పోలీసు అతిథిగృహంలో ఉన్న సిట్‌ కార్యాలయానికి ఈ ముగ్గురు అధికారులను శుక్రవారం వేర్వేరుగా పిలిపించి మాట్లాడారు. డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ కె.లతాకుమారి, దక్షిణ మండలం ఏసీపీ మానసతో వేర్వేరుగా మాట్లాడారు. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు వ్యవహారశైలిపై విచారించినట్టు తెలిసింది. అదే సమయంలో రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ వివరాలను సేకరించారు. అతడిపై నమోదైన కేసుల వివరాలను సిట్‌ అధికారులు తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయికృష్ణ మార్కాపురంలో ఉన్నట్టు ట్రాక్‌ చేసి అతడిని తీసుకురావాలని నాగరాజు రిక్విజిషన్‌ ఇచ్చినట్టు టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ లతాకుమారి తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ నుంచి ఎన్‌ఐ నవీన్‌, కానిస్టేబుల్‌ కృష్ణ, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ నుంచి రౌడీషీటర్ల బాధ్యతలను చూసే బాబూరావు మార్కాపురం వెళ్లినట్టు వివరించారు. ‘సాయికృష్ణను తీసుకొచ్చిన విషయాన్ని నాగరాజు మీ దృష్టికి తీసుకొచ్చారా’ అని డీసీపీ కృష్ణకాంత్‌ పటేల్‌, ఏసీపీ మానసను సిట్‌ అధికారులు అడిగినట్టు సమాచారం. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయిన తర్వాత నిందితులను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తారని అధికారులు చెప్పారు. సాయికృష్ణ విషయంలో మాత్రం ఏ విషయాన్ని తెలియజేయలేదని వివరించారు.


ఆ ఇద్దరి కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు

కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో నాగరాజుకు అన్ని విషయాల్లోను హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్‌, జంగం నాని సహకరించేవారని స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది సిట్‌ అధికారులకు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. నాగరాజును అరెస్టు చేసిన తర్వాత వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని సిట్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. వారిద్దరి ఇళ్లకు సిట్‌ బృందాలు గురువారం రాత్రి వెళ్లాయి. 5రోజులుగా వారు ఇళ్లకు రావడం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్టు సమాచారం. సిట్‌ ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని అధికారులు వారి కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. సాయికృష్ణ చనిపోయాడని సిట్‌ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చింది. ఆ మృతదేహాన్ని మాయం చేయడంలో అశోక్‌, నాగరాజుకు సన్నిహితుడిగా మెలిగే సురేశ్‌ అనే వ్యక్తి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సాయికృష్ణ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిన తర్వాత సురేశ్‌, నాని, అశోక్‌ ఒక కారులో అతడి మేనమామ నవరంగ్‌ ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. సురేశ్‌ మాత్రమే నవరంగ్‌ వద్దకు వెళ్లాడని, మిగిలిన ఇద్దరూ కారులోనే ఉన్నారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు సిట్‌ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది.

Updated Date - Jun 27 , 2026 | 05:39 AM