డ్రైవర్‌ను చంపేంత కక్ష ఎందుకు?
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:40 AM
కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2గా ఉన్న లక్ష్మీదుర్గ నాలుగో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు.
ప్రాణాలు తీసేంత పాపం అతనేం చేశాడు?
నాలుగో రోజూ లక్ష్మీదుర్గను ప్రశ్నించిన సిట్
కాకినాడ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2గా ఉన్న లక్ష్మీదుర్గ నాలుగో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం విచారణకు బ్రేక్ పడింది. కాకినాడ ఎస్‌డీపీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన విచారణకు ఆమె తన అనుచరుల సాయంతో వచ్చారు. ఈ విచారణలో అధికారులు ఆమె నుంచి కొంత కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 30 వరకు విచారణ జరిగే అవకాశం ఉండటంతో డ్రైవర్ హత్యకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునేందుకు సిట్ అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. డ్రైవర్‌ను చంపేంత కక్ష ఎందుకు? ప్రాణాలు తీసేంత పాపం అతను ఏం చేశాడు? అతను ఎన్నేళ్లుగా మీ వద్ద పనిచేస్తున్నాడు? అతడిని మీవద్ద పనికి కుదిర్చింది ఎవరు? అతని వ్యవహార శైలి ఎలా ఉండేది?... ఇలా పలు ప్రశ్నలను అధికారులు అడిగినట్టుగా తెలుస్తోంది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన విచారణ సాయత్రం 5 గంటల వరకు సాగింది. డ్రైవర్ హత్యకు గల ప్రధాన కారణం చెప్పండి.. ప్లీజ్.. మా ఇన్వెస్టిగేషన్‌కు సహకరించండి.. అంటూ సిట్ అధికారులు పదేపదే కోరుతున్నా ఆమె ఏమీ చెప్పట్లేదని తెలిసింది. ఇప్పటికే నాలుగు రోజులుగా గంటల తరబడి విచారణ సాగుతున్నా పెద్దగా పురోగతి లేదని సమాచారం. కాగా, విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో లక్ష్మీదుర్గ కళ్లు తిరిగి పడిపోయారు. అక్కడే ఉన్న ఆమె అనుచరులు సపర్యలు చేయడంతో కొంతసేపటికి కోలుకొని వెళ్లిపోయారు.