రుషికొండ ప్యాలెస్ దగ్గర 100 కోట్ల ఆస్తి!
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:45 AM
వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పీఏ హోదాలో కేఎన్‌ఆర్ చేసిన దోపిడీకి అంతే లేదు. విశాఖపట్నంలో రుషికొండ ప్యాలె్‌సకు సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో...
దాని ప్రభుత్వ విలువే 32 కోట్లు
అంత మొత్తం ఎక్కడిదని ప్రశ్నించిన సిట్
అప్పట్లో దాని ధర 12 కోట్లేనన్న కేఎన్‌ఆర్
తన బావమరిది పంపితే కొన్నట్లు వెల్లడి
32 కోట్లకు కొన్న డాక్యుమెంటును ఆయన ముందు పెట్టిన సిట్ అధికారులు
జవాబివ్వలేక నీళ్లు నమిలిన జగన్ పీఏ
అమరావతి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పీఏ హోదాలో కేఎన్‌ఆర్ చేసిన దోపిడీకి అంతే లేదు. విశాఖపట్నంలో రుషికొండ ప్యాలె్‌సకు సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండున్నర ఎకరాల భూమి కొన్నట్లు సిట్ గుర్తించింది. ఐటీ పార్క్‌లో ఉన్న దీని విలువ ఇప్పుడు రూ.వంద కోట్ల పైమాటే. దీనిని రూ.32 కోట్లకు కేఎన్‌ఆర్ కొన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు సోమవారం ఆ విషయమై అతడిని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు 2005లో ఎన్‌సీసీ కంపెనీకి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 97 ఎకరాల భూమి అప్పగించారు. 2013 వరకూ అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ భూమిని తిరిగి దక్కించుకున్న ఎన్‌సీసీ అందులో నిర్మాణాలు మొదలుపెట్టింది. 2019లో జగన్ సీఎం కాగానే వైసీపీ నేతల కన్ను ఆ భూమిపై పడింది. ఎవరి శక్తి కొద్దీ వారు అందులో చేతనైనంత భూమి దక్కించుకోగా.. జగన్ పీఏ కేఎన్‌ఆర్ సైతం రెండున్నర ఎకరాలు కొట్టేశాడు. విశాఖలో పచ్చని రుషికొండను తవ్వి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేసి జగన్ నిర్మించుకున్న రుషికొండ ప్యాలె్‌సకు అత్యంత సమీపంలోని ఐటీ పార్క్‌లో ఏకంగా రూ.100 కోట్ల విలువ చేసే ఈ భూమిని ఎలా కొన్నారని సిట్ అధికారులు అతడిని ప్రశ్నించారు. అప్పట్లో దాని విలువ రూ.12 కోట్లేనని.. లండన్‌లో ఉంటున్న తన బావమరిది దేవపట్ల రామ్‌భూపాల్‌రెడ్డి ఆ డబ్బులు పంపారని చెప్పాడు. ఏ ఖాతాకు ఎప్పుడు పంపాడు.. ఎవరి ఖాతా నుంచి ఆ సొమ్ము ఆస్తి విక్రేతలకు చేరింది.. అని సిట్ ప్రశ్నించగా.. జవాబివ్వలేక కేఎన్‌ఆర్ నీళ్లు నమిలినట్లు తెలిసింది. అదీగాక ఆ భూమి ప్రభుత్వ విలువే రూ.32 కోట్లుగా ఉందని, అంతే మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఉన్న డాక్యుమెంటు సంగతేంటని దానిని అతడి ముందు పెట్టడంతో అతడు బిత్తరపోయినట్లు సమాచారం. అలాగే లిక్కర్ వ్యాపారులు అప్పట్లో ఇచ్చిన మామూళ్ల వివరాలనూ అతడి నుంచి రాబట్టినట్లు తెలిసింది.