నాగరాజును కస్టడీకి ఇవ్వండి
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:17 AM
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో..
సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారో వివరాలు రాబట్టాలి
విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్
విజయవాడ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణను చంపేశాక మృతదేహాన్ని మాయం చేశారని, ఆ మృతదేహాన్ని ఏం చేశారన్న వివరాలను రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై కౌంటర్ దాఖలుకు 30వ తేదీ వరకు గడువు ఇస్తూ కోర్టు విచారణ వాయిదా వేసింది. కాగా తనకు ఇంటి నుంచి భోజనం అనుమతించాలని రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఎస్‌ఎస్‌వీవీ నాగరాజు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది కొంపెళ్ల అరుణ్‌కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించడంతో పాటు అవకాశాన్ని బట్టి సదుపాయాలు కల్పించాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.
న్యాయవిచారణ పిటిషన్‌పై విచారణ వాయిదా
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో న్యాయవిచారణ జరిపించాలని అతని తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఆమె విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాల ఫుటేజీ మాయమైన నేపథ్యంలో దాన్ని జిల్లా స్థాయి ఓవర్ సైట్ కమిటీ నుంచి రప్పించాలని న్యాయవాది ముళ్లపూడి సతీశ్‌బాబు రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిటీ విధివిధానాలు క్రోడీకరిస్తూ మెమో దాఖలు చేయాలని ఆదేశిస్తూ న్యాయాధికారి విచారణను 29వ తేదీకి వాయిదా వేశారు.