బులియన్‌కు ‘లిక్కర్’ కిక్
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:18 AM
మద్యం కుంభకోణంలో ఏ49గా ఉన్న అనిల్‌చోక్రాపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మంగళవారం చార్జిషీటు దాఖలు చేశారు. చోక్రాను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో అధికారులు ఛార్జిషీటును కోర్టులో సమర్పించారు.
ఈ వ్యవహారంలో అనిల్‌చోక్రా సూత్రధారి
ఆయనపై ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి
నాలుగు షెల్ కంపెనీలకు నిధులు చేర్చాడు
అనిల్‌చోక్రా పై చార్జిషీటు దాఖలు చేసిన సిట్
విజయవాడ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ49గా ఉన్న అనిల్‌చోక్రాపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మంగళవారం చార్జిషీటు దాఖలు చేశారు. చోక్రాను అరెస్టు చేసి 90 రోజులు కావడంతో అధికారులు ఛార్జిషీటును కోర్టులో సమర్పించారు. ఇందులో అనిల్‌చోక్రా పాత్రను ఆధారాలతో సహా వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మద్యం కుంభకోణంలో నిధులను ఇక్కడి నిందితులు అనిల్‌చోక్రా ద్వారా బులియన్ మార్కెట్‌లోకి మళ్లించినట్టు వివరించారు. మనీ లాండరింగ్‌లో అనుభవం ఉన్న అనిల్‌ను మద్యం కుంభకోణంలోని నిందితులు ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. రాజస్థాన్‌కు చెందిన అనిల్‌చోక్రా నవీ ముంబైలో స్థిరపడ్డాడు. రాష్ట్రంలో మద్యం కంపెనీల ద్వారా వచ్చిన ముడుపులను మళ్లించడానికి కేసులోని ప్రధాన నిందితులు ఆయనను సంప్రదించారు. అనిల్ సృష్టించిన నాలుగు సూట్‌కేస్ కంపెనీలకు రూ.77.55 కోట్లు మళ్లించారు. ఆదాన్ డిస్టలరీ నుంచి రూ.18 కోట్లు, లీలా డిస్టిలరీస్ ఉంచి రూ.20 కోట్లు, స్పై ఆగ్రో డిస్టిలరీస్ నుంచి రూ.39 కోట్లు ఈ కంపెనీలకు వెళ్లినట్టు సిట్ గుర్తించింది. ఈ నాలుగు కంపెనీలకు వెళ్లిన డబ్బులు తర్వాత మరో 32 షెల్ కంపెనీలకు వెళ్లాయి. అక్కడి నుంచి ప్రధాన నిందితుల చేతుల్లోకి వెళ్లినట్టు సిట్ తేల్చింది. చోక్రాపై ముంబైలో ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులు ఉన్నాయని అధికారులు ఛార్జిషీటులో పేర్కొన్నారు. రూ.304 కోట్లకు ఓ బ్యాంకును, జీఎస్టీ అధికారులను మోసం చేశాడు. దీనిపై ముంబైలోని ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాలుగు కేసులు నమోదు చేసిందని స్పష్టం చేశారు.