SIT Investigation: కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు పూర్తి!
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:50 AM
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి సరఫరా వ్యవహారంలో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం.
పండుగ తర్వాత మలి విడత చార్జిషీటు!!
తిరుపతి(నేరవిభాగం), జనవరి 11(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి సరఫరా వ్యవహారంలో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్ష్యాల సేకరణ, నిందితుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల పరిశీలన వంటి కీలక ప్రక్రియలు ముగిసిన నేపథ్యంలో సంక్రాంతి అనంతరం రెండో విడత చార్జిషీటు దాఖలు చేసే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన తుది పరిశీలన, డాక్యుమెంట్ల ఫైనలైజేషన్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శనివారం సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు తొలిసారిగా తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు బృంద అధికారులతో ఆయన భేటీ అయినట్లు సమాచారం. వీరేశ్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు ఆదివారం తిరుమల శ్రీవారిని, అనంతరం తిరుచానూరు అమ్మవారిని, గుడిమల్లం ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమైనట్లు సిట్ అధికారులు తెలిపారు.