అది నెయ్యే కాదు
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:11 AM
జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా అయింది అసలు నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టంచేసింది.
పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం!
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ
నెల్లూరు కోర్టులో తుది చార్జిషీటు దాఖలు
12 మంది టీటీడీ ఉద్యోగులు సహా 36 మందిపై అభియోగాలు
భోలేబాబా డెయిరీ కేంద్రంగా కల్తీ దందా
ఆ డెయిరీకి అసలు ఆవులే లేవు
బయటి నుంచి కూడా పాలు కొనలేదు
టీటీడీ పెద్దలు, సరఫరాదారులు కుమ్మక్కు
2019-24 మధ్య 60.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా
కల్తీ అని తెలిసీ అనుమతించిన అధికారులు
టీటీడీకి రూ.250 కోట్లు నష్టం
కల్తీ నెయ్యి కేసులో ముగిసిన దర్యాప్తు
చార్జిషీటులో ప్రతి అంశానికీ ఆధారాలు
నిందితుల జాబితాలో 5 డెయిరీలు, 31 మంది వ్యక్తులు
చార్జిషీట్లో వివరించిన సిట్ అధికారులు
తిరుపతి/అమరావతి/నెల్లూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా అయింది అసలు నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టంచేసింది. పామాయిల్‌లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారుచేశారని నిగ్గుతేల్చింది. నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డెయిరీకి అసలు ఆవులే లేవని, బయటి నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొంది. టెండర్ దక్కించుకున్న సరఫరా సంస్థలకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. కెమికల్స్, ముడి పదార్థాలు కలిపి భోలే బాబా డెయిరీ తయారుచేసిన నకిలీ నెయ్యి.. ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా అయినట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపింది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం తుది చార్జిషీటు దాఖలుచేసింది. టీటీడీ అధికారులు, గత ప్రభుత్వ పెద్దలు, నెయ్యి సరఫరాదారులు కుమ్మక్కై ప్రణాళిక ప్రకారం కోట్లాది మంది శ్రీవేంకటేశ్వరుడి భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీశారని తెలిపింది. భోలే బాబా డెయిరీ, టీటీడీ బోర్డు పెద్దలు, అధికారులు నడిపించిన తతంగాన్ని కూలంకషంగా వివరించింది. నెయ్యి సరఫరాలో కుట్రలకు ఆధారాలు సమర్పించడంతో పాటు టెండర్లలో నిబంధనల మార్పు ద్వారా అంతిమంగా ఎవరెవరు ఎలా లబ్ధి పొందారు.. ఢిల్లీలోని మలేసియా పామాయిల్ దిగుమతిదారు నుంచి హర్ష ఫ్రెష్ డెయిరీ పేరుతో పామాయిల్.. అజయ్ కుమార్ సగంధ్ అనే వ్యాపారి నుంచి కెమికల్ కొనుగోలు చేసి ఫేక్ నెయ్యి ఎలా తయారుచేశారు.. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న, టీటీడీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎలా కుమ్మక్కయ్యారో చార్జిషీట్లో వివరించింది.
ఇదీ నేపథ్యం..
2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో.. తిరుమలేశుడి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని వరుస ఫిర్యాదులు రావడం.. అదే సమయంలో లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు కలిసినట్లు మైసూరులోని ల్యాబ్ నివేదిక ఇవ్వడంతో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీని నిగ్గుతేల్చేందుకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ(ఇప్పుడు ఐజీ) గోపీనాథ్ జెట్టి తదితర పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు దీనిని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం అదే ఏడాది అక్టోబరులో సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు నేతృత్వంలో సీబీఐ ఎస్పీ మురళీ రాంబా, ఏపీ కేడర్ ఐజీలు ఎస్‌ఎస్ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి, భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) సీనియర్ అధికారి సత్య కుమార్ పాండాలతో సిట్‌ను ఏర్పాటుచేసింది. మరో 30 మంది పోలీసు అధికారులు, సిబ్బంది సాయంతో 15 నెలల క్రితం తిరుపతిలో ప్రారంభమైన దర్యాప్తు.. 12 రాష్ట్రాలకు విస్తరించింది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. అదనపు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలోని సిట్ బృందం శుక్రవారం నెల్లూరు కోర్టుకు వచ్చి చార్జిషీటు దాఖలు చేసింది.
భోలేబాబా యజమానులదే కీలక పాత్ర
కల్తీ నెయ్యి సరఫరా దందా మొత్తం భోలేబాబా డెయిరీ కేంద్రంగా నడిచిందని.. దాని యజమానులు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లే ఈ వ్యవహారంలో కీలక పాత్ర వహించారని సిట్ తెలిపింది. 2019-24 నడుమ టీటీడీకి 60.10 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని.. ఆ కాలంలో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్, ల్యాబ్ తదితర విభాగాల్లో పనిచేసిన పలువురు అధికారులకు, ఉద్యోగులు.. కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి ఆ నెయ్యినే అనుమతించారని పేర్కొన్నట్లు సమాచారం. తద్వారా టీటీడీ ఏకంగా రూ.250 కోట్ల వరకూ (రూ.16 కోట్ల జీఎస్టీతో కలిపి) దేవస్థానం నష్టపోయిందని.. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేందుకు వారు కారకులయ్యారని తెలిపింది. గత ఏడాది ఆగస్టులో వేసిన తొలి చార్జిషీటులో 15 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్.. ఇప్పుడు దర్యాప్తు ముగించి తుది చార్జిషీటు దాఖలుచేసింది. ఇందులో అదనంగా 21 మందిపై నేరారోపణ చేసింది. వారిలో 12 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులు, డెయిరీ నిపుణులు ఉన్నారు. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 36 కాగా.. అందులో ఐదు డెయిరీ సంస్థలు ఉన్నాయి. తుది చార్జిషీటులో 21 మంది నిందితులపై చేసిన నేరారోపణలకు సంబంధించి ప్రతి అంశంపైనా కోర్టుకు ఆధారాలు సమర్పించింది.
15 నెలలు.. 12 రాష్ట్రాల్లో సిట్ దర్యాప్తు
సిట్ 15 నెలల పాటు దర్యాప్తు సాగించింది. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా తదితర 12 రాష్ట్రాల్లో పర్యటించింది. తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ మొదలుకొని ఏపీలోని వైష్ణవి డెయిరీ, ఉత్తర భారతంలో భోలేబాబా డెయిరీ, హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్, ప్రీమియర్ ఫుడ్స్, మాల్ గంగా తదితర పలు ప్రైవేటు డెయిరీలను, వాటి ప్లాంట్లను, ల్యాబ్‌లను తనిఖీ చేసింది. ఆయా సంస్థలకు నెయ్యి తయారీకి రసాయన పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరా చేసిన సంస్థల్లో సైతం సోదాలు జరిపి వాటి యజమానులు, అధికారులు, ఉద్యోగులను విచారించింది. మధ్యవర్తులను, హవాలా ఏజెంట్లను సైతం ప్రశ్నించింది. భారీగా రికార్డులను, ఫైళ్లను, సాంకేతిక ఆధారాలను సేకరించింది. డెయిరీల యజమానుల నుంచి నెయ్యి ట్యాంకర్ల డ్రైవర్ల వరకూ వందలాది మందిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. 2019-24 మధ్య పనిచేసిన టీటీడీ ఈవోలు, ఛైర్మన్లు, పాలక మండలి సభ్యులు, మార్కెటింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు, ల్యాబ్ ఉద్యోగులు, పోటు ఉద్యోగులు, కార్మికులను సైతం ప్రశ్నించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్నప్పన్న అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగింది.
నిందితులు వీరే..
ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏ1), ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్(ఏ2), వైష్ణవి డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్ (ఏ3), వైష్ణవి డెయిరీ డైరెక్టర్ విపిన్ జైన్ (ఏ4) వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా (ఏ5), వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ6), భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్(ఏ7), వైష్ణవి డెయిరీ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షబ్బిల్ కలీముల్లా ఖాన్ అలియాస్ సమీర్ (ఏ8), టీటీడీ ఉద్యోగులు ఈ.నాగేంద్ర ప్రసాద్ (ఏ9), కరమల శేఖర్(ఏ10), మెస్సర్స్ హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ11), హరిమోహన్ రాణా(ఏ12), సంజయ్ చౌహాన్(ఏ13), ఆశిష్ రోహిలా (ఏ14), ఆశిష్ అగర్వాల్ (ఏ15), అజయ్ కుమార్ సుగంధ్(ఏ16), మహేశ్ కుమార్ రోహిరా (ఏ17), మచ్చీంద్ర శాంతారామ్ లంకే (ఏ18), మాల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ19), వైష్ణవి డెయిరీ డైరెక్టర్ రాజేశ్ మన్‌సుఖ్‌లాల్ చావడా(ఏ20), భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు సారికా జైన్ (పొమిల్ జైన్ భార్య-ఏ21), పూనమ్ జైన్ (విపిన్ జైన్ భార్య-ఏ22), బోలేబాబా ల్యాబ్ ఇన్‌చార్జి రవీందర్ శర్మ (ఏ23), చిన్నప్పన్న (వైవీ సుబ్బారెడ్డి పీఏ-ఏ24), టీటీడీ ఉద్యోగులు పల్లి ఈశ్వర్‌రెడ్డి (ఏ25), ముద్దు వెంకట అనిల్ కుమార్ (26), టీటీడీ డిప్యూటీ ఈవో (రిటైర్డ్) పోలేపల్లి వెంకట నటేశ్‌బాబు (ఏ27), టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ రిటైర్డ్ జీఎంలు పేరూరు జగదీశ్వర్‌రెడ్డి (ఏ28), ఆర్‌వీఎస్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం (ఏ29), ప్రళయకావేరి మురళీకృష్ణ (ఏ30), టీటీడీ గోశాల పూర్వ డైరెక్టర్ డాక్టర్ కె.హరినాధరెడ్డి (ఏ31), టీటీడీ టెక్నికల్ ఇన్‌స్పెక్షన్ కమిటీ మెంబర్ మల్లం మహేందర్ (హైదరాబాద్-ఏ32), టెక్నికల్ కమిటీ సభ్యులు వి.వెంకటసుబ్రమణియన్ (కోయంబత్తూరు-ఏ33), ఎం.విజయభాస్కర్‌రెడ్డి (సికింద్రాబాద్-ఏ34), బత్తుల సురేంద్రనాథ్ (బెంగళూరు-ఏ35), కె.జయరాజారావు (ఏ36).