రంగంలోకి సిట్
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:17 AM
విజయవాడలో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజుపై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రంగంలోకి దిగింది. సిట్ చీఫ్ రవిప్రకాశ్, సభ్యులు అద్నాన్ నయీం అస్మి, అమిత్ బర్దార్, ఎల్.సుధాకర్ విజయవాడకు సోమవారం చేరుకున్నారు.
ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై కేసు విచారణ
కమాండ్ కంట్రోల్ నుంచి రవిప్రకాశ్ పర్యవేక్షణ
బాధితుల ఇంటికి అమిత్ బర్దార్, సుధాకర్
మధ్యాహ్నం వరకు వాంగ్మూలాలు
మధ్యాహ్నం నుంచి స్టేషన్‌లో విచారణ
నాగరాజుకు పెరుగుతున్న మద్దతు
మహిళలు, యువతుల ర్యాలీ.. బైఠాయింపు
ఆయన సస్పెన్షన్ తర్వాత గంజాయి బ్యాచ్‌లు కార్యకలాపాలు మొదలుపెట్టాయని ఆందోళన
విజయవాడ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
విజయవాడలో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ్‌సవీవీ నాగరాజుపై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రంగంలోకి దిగింది. సిట్ చీఫ్ రవిప్రకాశ్, సభ్యులు అద్నాన్ నయీం అస్మి, అమిత్ బర్దార్, ఎల్.సుధాకర్ విజయవాడకు సోమవారం చేరుకున్నారు. అమిత్ బర్దార్, సుధాకర్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పది మంది వరకు ఉదయం 8 గంటలకు కృష్ణలంక నల్లగేటు ప్రాంతంలో ఉన్న సాయికృష్ణ మేనమామ ఇంటికి చేరుకున్నారు. అక్కడ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామలు ముళ్లపూడి నాగేశ్వరరావు. నవరంగ్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు విచారణ జరుగుతున్నంతసేపు ఆ వీధిలోకి ఇతరులను అనుమతించలేదు. భోజన విరామం తర్వాత అద్నాన్ నయీం అష్మి, అమిత్ బర్దార్, సుధాకర్‌తో కూడిన బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ రాత్రి వరకు విచారణ చేసింది. ముందుగా సాయికృష్ణ నేరప్రవృత్తిపై ఆరా తీసింది. అతడిపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని కేసుల్లో శిక్ష పడింది? రౌడీషీట్ ఎప్పుడు తెరిచారు? అన్న వివరాలను స్టేషన్‌లో తీసుకుంది. ప్రతి ఆదివారం రౌడీషీటర్లకు స్టేషన్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనికి వచ్చిన వాళ్లందరి నుంచి హాజరు తీసుకుంటారు.
రౌడీషీట్ తెరిచిన తర్వాత ఎన్నిసార్లు సాయికృష్ణ కౌన్సెలింగ్‌కు వచ్చాడు? నాగరాజు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నిసార్లు హాజరయ్యాడు? అన్న వివరాలను సేకరించింది. దీనిపై సిట్ బృందం సొంతంగా ఒక రికార్డు తయారు చేస్తోంది. విజయవాడ నగరం నుంచి సాయికృష్ణ ఎప్పుడు మకాం మార్చాడన్న సమాచారాన్ని తీసుకుంది. అతడికి సంబంధించిన కేసుల రికార్డులను సిట్ పరిశీలించింది. చిల్లకల్లులో జరిగిన స్నేహితుడు నవీన్‌రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్లిన తర్వాత ఎప్పుడు విడుదలయ్యాడన్న వివరాలను అధికారులు తీసుకున్నారు. జైలు నుంచి బయటకు రావడానికి ఎవరు బెయిల్ ఇచ్చారు? బెయిల్ ఎలా వచ్చిందన్న దానిపైనా వివరాలు తీసుకున్నారని తెలిసింది. విచారణ ప్రక్రియను సిట్ చీఫ్ రవిప్రకాశ్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నుంచి పర్యవేక్షించారు.
కంట్రోల్ రూంలోనా.. గెస్ట్‌హౌస్‌లోనా..
కేసు విచారణ పూర్తయ్యే వరకు సిట్ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సిట్ బృందానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై విచారణకు తొలుత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ను నియమించారు. ఆయనకు కమిషనరేట్‌లో ఒక చాంబర్‌ను కేటాయించాలని భావించారు. తర్వాత ప్రభుత్వం ఏకంగా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. కిషోర్‌కు కేటాయించాలనుకున్న చాంబర్‌ను సిట్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదన జరుగుతోంది. ఇదిలావుండగా సిట్ బృందం మొత్తం విజయవాడ చేరుకుంది. కొన్ని కార్యకలాపాలను ఎంజీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిర్వహించారు. కొన్ని కార్యకలాపాలను అంబేడ్కర్ స్మృతివనం ఎదురుగా ఉన్న పోలీసు అతిథిగృహం నుంచి నిర్వహించారు. ఈ రెండింటిలో ఒకదానిలో సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
నాగరాజుకు మద్దతుగా ర్యాలీ
మరోవైపు నాగరాజుకు మహిళలు, యువకుల నుంచి మద్దతు పెరుగుతోంది. అజిత్‌సింగ్‌నగర్‌లో ఉన్న ఆయన ఇంటి ముందు యువకులు సోమవారం మద్దతుగా నిరసన తెలిపారు. ‘ఐ స్టాండ్ విత్ యూ’ ప్లకార్డులు పట్టుకుని నాగరాజును అరెస్టు చేయవద్దంటూ నినాదాలు చేశారు. బాలాజీనగర్, రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాల మహిళలు, యువతులు.. బాలాజీనగర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నేతాజీ వంతెనకు ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో చాలాసేపు వాహనాలు ఆగిపోయాయి. నేరగాళ్ల పట్ల సింహస్వప్నంలా ఉండే నాగరాజుపై చర్యలు తీసుకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని పలువురు వ్యాఖ్యానించారు. ఆయన్ను బదిలీ చేశాక గంజాయి బ్యాచ్‌లు మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టాయని తెలిపారు.