Share News

తల్లీ కొడుకులను కలిపిన ‘సర్‌’

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:38 AM

30 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకును.. ‘సర్‌’ ఓటరు ప్రక్రియ తల్లి దగ్గరకు చేర్చింది. సర్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు సొంతూరుకు వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి, కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

తల్లీ కొడుకులను కలిపిన ‘సర్‌’

  • 30 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన కుమారుడు

  • సంభ్రమాశ్చర్యాల్లో కుటుంబ సభ్యులు

ఎమ్మిగనూరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): 30 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకును.. ‘సర్‌’ ఓటరు ప్రక్రియ తల్లి దగ్గరకు చేర్చింది. సర్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు సొంతూరుకు వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి, కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఆదోని బైపాస్‌ రోడ్డులో నివసిస్తున్న కురువ ఎల్లన్న, ఎల్లమ్మలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రాముడు చివరి సంతానం. రాముడు, అతని చిన్నాన్న కుమారుడు నాగరాజు 1996లో టెన్త్‌ ఫెయిల్‌ అయ్యారు. దీంతోవారు ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. ఐదేళ్ల తర్వాత నాగరాజు తిరిగొచ్చినా.. రాముడు అక్కడే ఉండిపోయాడు. ఆతర్వాత రాముడు ముంబై నుంచి బెంగళూరు వెళ్లాడు.అక్కడే పనులు చేసుకుంటూ జీవించాడు. తర్వాత యశ్వంత్‌పూర్‌ ప్రాంతంలోని తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం ఆశ్రయం ఇవ్వటంతో వారి దగ్గరే ఉన్నాడు. ఆ కుటుంబమే రాముడికి తమ బంధువుల్లోని సుశీల అనే యువతితో వివాహం చేశారు. అప్పటి నుంచి ఆటో నడుపుకుంటూ అక్కడే జీవించాడు. ప్రస్తుతం సర్‌ ప్రక్రియ నడుస్తుండటంతో ఓటు నమోదు చేసుకోవాలంటే తల్లిదండ్రుల ఓటరు ఐడీతో మ్యాపింగ్‌ చేయాల్సి ఉండటంతో సొంతూరు వచ్చాడు. 30ఏళ్ల తర్వాత కొడుకు తిరిగిరావడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

Updated Date - Jul 23 , 2026 | 06:40 AM