నెయ్యి టెండర్ల ప్రక్రియపై అధ్యయనం ప్రారంభం
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:37 AM
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరాకు బాధ్యులను గుర్తించేందుకు ఏకసభ్య కమిషన్ అధ్యయనం ప్రారంభమైంది.
తొలిరోజు దస్త్రాలను పరిశీలించిన ఏకసభ్య కమిషన్
తిరుపతి(టీటీడీ), మార్చి 3(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరాకు బాధ్యులను గుర్తించేందుకు ఏకసభ్య కమిషన్ అధ్యయనం ప్రారంభమైంది. కమిషన్ సారథి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకొని నెయ్యి సేకరణకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్నంగా పరిశీలించారు. న్యాయస్థానంలో సిట్ ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్‌లోని అంశాలను అధ్యయనం చేశారు. టెండర్ల నుంచి స్వామివారి ప్రసాదాలకు నెయ్యి వినియోగించడం వరకూ మొత్తం ప్రక్రియను ఆయన పూర్తిస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రసాదాల వినియోగానికి రోజుకు ఎంత నెయ్యి వినియోగిస్తారు, ఎంత నిల్వ ఉంచాతారు, టెండర్లు ఎప్పుడు పిలుస్తారనే విషయాలతో పాటు టెండర్లు పిలిచిన తర్వాత జరిగే ప్రక్రియను అధ్యయనం చేశారు. అలాగే నెయ్యి సరఫరా కోసం నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించారు. వివిధ సంస్థలు టెండర్లు దాఖలు చేసిన తర్వాత ఏ విధంగా సరఫరాదారులను ఖరారు చేస్తారు? సాంకేతిక కమిటీ, ఎక్స్‌పర్ట్ కమిటీలు, కొనుగోలు కమిటీ(బోర్డు సభ్యులతో)ల పాత్రల గురించి అధ్యయనం చేశారు. టెండరు ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నోట్ తయారు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో టీటీడీ అధికారులు ఎన్నిసార్లు టెండరు పిలిచారు, ఎప్పుడెప్పుడు నెయ్యి కొనుగోలు ప్రమాణాల్లో మార్పులు తీసుకువచ్చారనే అంశాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 45 రోజుల్లోనే ప్రక్రియను ముగించాల్సి ఉన్న నేపథ్యంలో దినేశ్ కుమార్ దస్త్రాల పరిశీలనను ప్రారంభించారు.