Share News

హాజరు ప్రభుత్వ బడిలో.. చదువు ప్రైవేటులో..

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:29 AM

ఒకవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ ఫుల్‌ అయి ‘నో అడ్మిషన్‌’ బోర్డులు కనిపిస్తుంటే.. మరోవైపు కొన్ని పాఠశాలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి.

 హాజరు ప్రభుత్వ బడిలో.. చదువు ప్రైవేటులో..

  • ఒకే ఒక విద్యార్థినితో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల

  • ఆమెకూ అందని విద్యా సామగ్రి, మధ్యాహ్న భోజనం

  • రిజిస్టర్‌లో మాత్రం 14 మంది వస్తున్నట్టు రికార్డు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఒకవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ ఫుల్‌ అయి ‘నో అడ్మిషన్‌’ బోర్డులు కనిపిస్తుంటే.. మరోవైపు కొన్ని పాఠశాలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కనిపిస్తున్నా.. చదువు మాత్రం ప్రైవేటు స్కూళ్లలో కొనసాగుతోంది. నంద్యాల జిల్లా.. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకే ఒక విద్యార్థితో నడుస్తోంది. ఒకటో తరగతిలో ఒక విద్యార్థిని మాత్రమే పాఠశాలకు వస్తోంది. కానీ.. ఉపాధ్యాయుడు కృష్ణారావు మాత్రం హాజరు పట్టికలో ఐదుగురు వస్తున్నట్లు చూపుతున్నాడు. మిగిలిన నలుగురు విద్యార్థులు స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. రెండో తరగతి రిజిస్టర్‌లో 9 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నట్లు అటెండెన్స్‌లో చూపారు. కానీ.. అందులో ఏ ఒక్కరూ పాఠశాలకు రావడం లేదు. అందరూ ప్రైవేట్‌ స్కూళ్లలో చేరిపోయారు. మొత్తానికి ఈ పాఠశాలకు రోజూ హజరవుతున్న ఏకైక విద్యార్థిని నిహారిక మాత్రమే.

అయితే పాఠశాల తెరిచి రెండు వారాలవుతున్నా ఆమెకు స్కూల్‌ బ్యాగ్‌ ఇవ్వలేదు. యూనిఫాం, పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు. చివరకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టడం లేదు. దీంతో పాఠశాల పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ఆ విద్యార్థిని మధ్యాహ్నం భోజనం చేస్తోంది. ఈ దుస్థితిపై నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రెడ్డిని వివరణ కోరగా... ఈ విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jul 03 , 2026 | 06:30 AM