సిగ్నల్స్ సరే.. రోడ్ల విస్తరణ ఏదీ?
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:16 PM
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేశారు.
ఆదోనిలో రూ.36 లక్షలతో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు
ఇరుకైన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆదోని, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అయితే రోడ్ల విస్తరణ చేపట్టడం మాత్రం మరిచిపోయారు. పట్టణ వాసులు ఇరుకైన రోడ్లతో పడుతున్న బాధలు వర్ణణాతీతం. ట్రాఫిక్ నియంత్రణ కోసం అధికారులు ముందడుగు వేసి రూ.36 లక్షలతో అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పునాది లేకుండా మేడ కట్టినట్లు.. రోడ్ల విస్తరణ చేపట్టకుండా కేవలం సిగ్నళ్లు ఏర్పాటు చేయడంపై పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. దశాబ్దాల క్రితం నాటి ఇరుకైన రోడ్లు, రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి తోడు ఈ సిగ్నల్ వ్యవస్థ వాహనదారుల పాలిట శాపంగా మారింది.
నిమిషాల వ్యవధిలోనే..
పట్టణంలో సిగ్నల్ పడగానే వాహనాలు నిలిచిపోతున్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండడంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే వాహనాల క్యూ అర కిలోమీటర్ మేర సాగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ మెయిన రోడ్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సిగ్నల్ గ్రీన్ పడినా, ముందున్న వాహనాలు కదలడానికి రోడ్డు సరిపోకపోవడంతో వెనుక ఉన్న వారు మళ్లీ రెడ్ సిగ్నల్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
మార్కెట్ యార్డు రద్దీ..
దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన అతిపెద్ద కాటన్ మార్కెట్ యార్డులలో ఆదోని ఒకటి. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లు, భారీ లారీలతో రైతులు తమ దిగుబడులను ఇక్కడికి తీసుకు వస్తుంటారు. ఈ భారీ వాహనాలు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా వెళ్లాల్సి ఉండడంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అటు రైతులకు, ఇటు సామాన్య ప్రయాణికులకు సమయం వృథా కావడమేగాకుండా ఇబ్బందులు తప్పడం లేదు.
పోలీ్‌స స్టేషన్ ముందే ఆక్రమణలు..
ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్‌కు అతి సమీపంలోనే నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక స్వీట్ స్టాళ్ల వద్ద, ఇతర వ్యాపార సంస్థల ముందు ద్విచక్ర వాహనాలను ఇష్టా రాజ్యంగా రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. మున్సిపల్ రోడ్డులో కనీసం పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనదారులు రోడ్లను ఆక్రమిస్తున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోకుండా మొద్దు నిద్రపోతున్నారని స్థానికులు మండి పడుతున్నారు.
రహదారుల విస్తరణపై దృష్టి సారించాలి
సిగ్నల్స్ పెట్టే ముందు రోడ్లు విస్తరించాలి. ఆక్రమణలను తొలగించి, ఫుట్‌పాత్‌లను నిర్మించాలి. అప్పుడే ట్రాఫిక్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం ఉన్న రోడ్లే ఇప్పటికీ ఉండడం, కానీ జనాభా మాత్రం రెట్టింపు కావడం ఈ సమస్యకు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం టెక్నాలజీ (సిగ్నల్స్)ని నమ్ముకుంటే సరిపోదు, మౌలిక సదుపాయాలైన రహదారుల విస్తరణపై దృష్టి సారించాలి. టౌన్ ప్లానింగ్ అధికారులు కదిలి, అక్రమ ఆక్రమణలను తొలగించి రోడ్లను వెడల్పు చేసిన తర్వాతే ఈ సిగ్నల్స్ అమలు చేస్తే ప్రయోజనం ఉం టుందని ఆదోనివాసులు కోరుతున్నారు.