Share News

బుల్లెట్‌ బండిపై సీదిరి కుమారుడు!

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:20 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, ఆయన స్నేహితుడు ప్రయాణిస్తున్న బుల్లెట్‌ బండి ఢీకొని ఓ గొర్రెల కాపరి చనిపోయాడు.

బుల్లెట్‌ బండిపై సీదిరి కుమారుడు!

  • వాహనం ఢీకొని గొర్రెల కాపరి దుర్మరణం

  • నడిపిందెవరనే అంశంపై సందిగ్ధత.. స్నేహితుడిపై కేసు

  • లోతుగా విచారిస్తే నిజాలు వెలుగులోకి.. బాధిత కుటుంబానికి 9 లక్షలు ఇచ్చి రాజీ!?

శ్రీకాకుళం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, ఆయన స్నేహితుడు ప్రయాణిస్తున్న బుల్లెట్‌ బండి ఢీకొని ఓ గొర్రెల కాపరి చనిపోయాడు. ఆ సమయంలో ద్విచక్ర వాహనం ఎవరు నడుపుతున్నారనే అంశంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సీదిరి కుమారుడు ఆరవ్‌ నడుపుతున్నట్లు కొందరు చెబుతుండగా... కేసు మాత్రం బుల్లెట్‌ బండి ఓనర్‌ అయిన ఆయన స్నేహితుడు సిద్ధార్థ (సిద్ధు)పై నమోదైంది. దీనిపై లోతుగా విచారణ జరిపితే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. స్థానికులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.... శుక్రవారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో పలాస పారిశ్రామిక వాడ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సూదికొండ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య(45) రోడ్డుపై వెళ్తుండగా.. ఆరవ్‌, సిద్ధార్థ వెళుతున్న బుల్లెట్‌ (ఏపీ 40ఏఎఫ్‌ 9994) అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో దానయ్య అక్కడిక్కడే మృతిచెందారు. యాక్సిడెంట్‌ చేసిన బుల్లెట్‌.. ఆరవ్‌ స్నేహితుడు సిద్ధు పేరుమీద ఉంది. సిద్ధునే యాక్సిడెంట్‌ చేసినట్లుగా కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరోవైపు మృతుడు దానయ్య కుటుంబంతో తెరవెనుక మంతనాలు జరిపి రాజీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడి కుటుంబ సభ్యులకు సుమారు రూ.9 లక్షలు వరకు ఇచ్చినట్టు సమాచారం.

Updated Date - Jul 12 , 2026 | 05:20 AM