రొయ్య మేత ధరల పెంపుపై వెనక్కి తగ్గిన కంపెనీలు
ABN , Publish Date - May 14 , 2026 | 05:38 AM
రొయ్యల దాణా ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈమేరకు మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
భాగస్వామ్య పక్షాలతో మంత్రి అచ్చెన్న చర్చలు
ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం: పీయూ్‌షకు సీఎం లేఖ
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రొయ్యల దాణా ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈమేరకు మంత్రి అచ్చెన్నాయుడు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దాణా ధరలను అమాంతం పెంచుతూ కంపెనీలు నిర్ణయించడంతో రైతులు గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాణా తయారీ సంస్థలు, రైతు ప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. అనంతరం స్పందించిన రొయ్యల దాణా తయారీ కంపెనీల ప్రతినిధులు... పెంచిన దాణా ధరలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. రైతులు, దాణా తయారీ కంపెనీలు, అధికారులతో 15న ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నట్లు అచ్చెన్న తెలిపారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఇదే విషయంపై కేంద్రం జోక్యాన్ని కోరుతూ బుధవారం మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ‘ఆక్వా రైతులపై రొయ్యల దాణా ధరల భారాన్ని తగ్గించాలి. దాణా తయారీకి వినియోగించే ముడి పదార్ధాల ధరల నియంత్రణకు చొరవ తీసుకోవాలి. ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి’ అని చంద్రబాబు తన లేఖలో కోరారు.