‘శ్రేష్ఠ’ విద్యార్థులకు స్థానికత చిక్కులు
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:16 AM
రాష్ట్రంలో స్థానికత అంశం కొందరు విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘శ్రేష్ఠ’ ద్వారా మెరిట్‌లో ఇతర రాష్ట్రాల్లో చదివిన వందలాది విద్యార్థులకు ఇప్పుడు ఏపీలో ఉన్నత విద్య అడ్మిషన్లు పొం దడం కష్టంగా మారింది.
కేంద్ర పథకం కింద ఇతర రాష్ర్టాల్లో సీబీఎ్‌సఈ 9-12 తరగతులు చదువుకునే చాన్స్
ఇప్పుడదే ఆ ఎస్సీ విద్యార్థుల పాలిట శాపం.. సొంత రాష్ట్రంలోనే ‘నాన్ లోకల్’గా దుస్థితి
ఉన్నత విద్యలో 15శాతం కోటాకు పరిమితం.. అడ్మిషన్‌కు ముందు నాలుగేళ్లు రాష్ట్రంలో
చదివితేనే ‘స్థానికత’ కోటా అనే రూల్.. న్యాయం చేయాలంటున్న తల్లిదండ్రులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో స్థానికత అంశం కొందరు విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘శ్రేష్ఠ’ ద్వారా మెరిట్‌లో ఇతర రాష్ట్రాల్లో చదివిన వందలాది విద్యార్థులకు ఇప్పుడు ఏపీలో ఉన్నత విద్య అడ్మిషన్లు పొందడం కష్టంగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్రానికి చెందిన వారే అయినప్పటికీ.. ఇప్పుడు ఆ విద్యార్థులు ‘నాన్ లోకల్’గా మారిన పరిస్థితి నెలకొంది. మెరిట్ ద్వా రా శ్రేష్ఠ పథకంలో అడ్మిషన్లు పొంది, ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడమే శాపంగా మారిం ది. రాష్ట్ర నిబంధనల ప్రకారం ఉన్నత విద్య అడ్మిషన్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు అం టే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వర కు మన రాష్ట్రంలోనే చదివి ఉండాలి. అలాం టి విద్యార్థులకే 85 శాతం స్థానికత కోటా వర్తిస్తుంది. మిగిలిన విద్యార్థులు అన్ రిజర్వ్ డ్ కోటా 15 శాతంలోనే అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ స్కాలర్‌షిప్ ద్వారా బయటి రాష్ర్టాలకు వెళ్లి చదువుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రుల నివా స స్థలం ఆధారంగా స్థానికులుగా గుర్తించి, న్యాయం చేయాలని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
‘శ్రేష్ఠ’లో ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్లు
ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2022లో లక్షిత ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య(శ్రేష్ఠ) అనే పథకాన్ని ప్రారంభించింది. ఆ స్కీమ్ ద్వారా మెరిట్ విద్యార్థులకు సీబీఎ్‌సఈ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి వరకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెం దిన చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ర్టాల్లోనూ అడ్మిషన్లు పొంది, అక్కడకు వెళ్లి చదువుతున్నారు. ఏపీ విద్యార్థులు 2022-23 లో 118 మంది, 2023-24లో 320 మంది, 2024-25లో 349 మంది శ్రేష్ఠ పథకంలో అడ్మిషన్లు పొందారు. వారిలో చాలా మంది తెలంగాణ సహా ఇతర రాష్ర్టాల్లో చదువుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం తమ కోర్సులు పూర్తి చేశారు. వారంతా ఇప్పుడు ఉన్నత విద్యలో చేరాలి. కాగా, బయటి రాష్ర్టాల్లో చదివిన విద్యార్థులు ఇప్పుడు నాన్ లోకల్ కోటాలో అడ్మిషన్లు పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మెరిట్ ద్వారా శ్రేష్ఠ పథకంలో అడ్మిషన్లు పొందడమే ఇప్పుడు వారికి శాపంగా మారనుంది.
స్థానికత వర్తింపజేయాలి: పేరెంట్స్ అసోసియేషన్
కేంద్ర పథకం ద్వారా ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదువుకున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రుల నివాస స్థలం ఆధారంగా స్థానికులుగా గుర్తించాలని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. నిబంధనలను వెంటనే సవరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరహరి శిఖరం, జి.ఈశ్వరయ్య, ఇతర ప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాశారు.