800 గ్రాముల బంగారం.. 15 కిలోల వెండి..
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:44 AM
అదో చిన్న రేకుల గది. అందులో ఉండే వృద్ధురాలు రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటుంది. కానీ.. ఆమె ఇంట్లో తనిఖీ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.1.5 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు చూసి షాకయ్యారు.
రేకుల గదిలో 1.5 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు
తెనాలిలో టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో భారీగా వెలుగులోకి
తెనాలి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అదో చిన్న రేకుల గది. అందులో ఉండే వృద్ధురాలు రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటుంది. కానీ.. ఆమె ఇంట్లో తనిఖీ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.1.5 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు చూసి షాకయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బాలాజీరావుపేటకు సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరిబోయిన గురవమ్మ నివాసం ఉండే రేకుల ఇంట్లో కోటిన్నర విలువైన ఆభరణాలు, నగదు బయటపడటం సంచలనంగా మారింది. డీఎస్పీ జనార్ధనరావు చెప్పిన వివరాల మేరకు.. రైస్ పుల్లింగ్ చేస్తున్నారంటూ ఎస్పీ వకుల్ జిందాల్‌కు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్సు పోలీసులు గురవమ్మ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు గుర్తించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. ఇంత మొత్తంలో ఆభరణాలు ఎందుకున్నాయని పోలీసులు గురవమ్మను ప్రశ్నించగా.. తన అల్లుడు దాచుకున్నాడని చెప్పింది. తన అల్లుడు విజయవాడలో ఉంటాడని, భవానీపురంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడని చెప్పింది. ఫ్యాక్టరీలో పనిచేసేవారికి ఇంత బంగారం ఎక్కడిదని ప్రశ్నించడంతో.. ఆ ఫ్యాక్టరీలో భాగస్వామి అని, బాగా ఆస్థిపరులని చెప్పింది. దీంతో టాస్క్‌ఫోర్స్ బృందం విజయవాడలోని ఆమె అల్లుడి ఇంటికి వెళ్లగా.. అతడు పారిపోయాడని పోలీసులు చెప్పారు. ఆ బంగారం అతనిదేనా! లేక పారిశ్రామికవేత్తలెవరైనా అతడ్ని బినామీ కింద ఉపయోగించుకుంటున్నారా? లేదంటే అక్రమమార్గంలో సంపాదించాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.