విజయమ్మ లేఖ సుప్రీం కోర్టు తీర్పుతో సమానం
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:05 AM
విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేసింది. ఆస్తులపై ఆమె రాసిన లేఖ సుప్రీం కోర్టు తీర్పుతో సమానం’ అని ఏపీసీసీ...
నా జోలికొస్తే అఫెన్స్ ఆడగలను: షర్మిల
కడప, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేసింది. ఆస్తులపై ఆమె రాసిన లేఖ సుప్రీం కోర్టు తీర్పుతో సమానం’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అరటి రైతులను ఆదుకోవాలంటూ బుధవారం ఆమె కడప జేసీ నిధి మీనాకు వినతిపత్రం అందించారు. తొలుత షర్మిల అరటి కాయలను వాహనంలో వేసుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి స్వయంగా నడుపుతూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. అనంతరం షర్మిల కలెక్టర్ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘‘వైసీపీ నేతలను కుక్కలని నేను అనలేదు. ‘విజయమ్మ మాట్లాడవద్దంటే మాట్లాడుతున్నారు... అంటే మొరగడం కుక్కల నైజం’ అని మాత్రమే నేనన్నాను. వాళ్లే భుజాలు తడుముకుంటున్నారు. వైసీపీ జోలికి నేను వెళ్లను. నా జోలికి వస్తే మాత్రం అఫెన్స్ గేమ్ ఆడడం నాకూ తెలుసు. నా లక్ష్యం జగన్ కాదు. వైసీపీ సైతాన్ సైన్యం మూలానప్రతిసారీ సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తోంది. జగన్ మార్చి 11, 2024న బనానా ఇంటిగ్రేటెడ్ ప్లాంటు పులివెందులలో ప్రారంభించారు. ఇది ఎన్నికల కోసం చేసిన స్టంట్ మాత్రమే. ఆ రోజు ప్లాంటులో కనీస వసతులు లేవు. నేను ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించా. అరటి రైతుల కోసం నా పోరాటానికి మద్దతు పలకాల్సింది పోయి కోడిగుడ్డుపై ఈకలు పీకుతారా? సీఎంగా ఉండి బనానా ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు నడపలేదు? గల్ఫ్ యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోయాయి. టన్నుధర రూ.26 వేల నుంచి రూ.4వేలకు పడిపోయింది. కడప జిల్లాలో కోల్డ్ స్టోరేజీ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టన్ను అరటికి మద్దతు ధరగా రూ.12వేలిచ్చి ప్రభు త్వం కొనుగోలు చేయాలి’’ అని షర్మిల అన్నారు.