Share News

ఎంతసేపూ నరకడం.. చంపడమే!

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:23 AM

ఎంతసేపూ నరకాలి... చంపాలి... నాశనం చేయాలనేదే వైసీపీ సిద్ధాంతం అని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. నిర్మించాలనే ఆలోచనలే అసలు వైసీపీకి...

ఎంతసేపూ నరకడం.. చంపడమే!

  • నాశనం చేయాలనేదే వైసీపీ పని!: షర్మిల

అనంతపురం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎంతసేపూ నరకాలి... చంపాలి... నాశనం చేయాలనేదే వైసీపీ సిద్ధాంతం అని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. నిర్మించాలనే ఆలోచనలే అసలు వైసీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ లేవని, అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రజావేదికను కూల్చేశారన్నారు. ఇప్పుడు రాజధానిగా అమరావతి వద్దని, ‘మావిగన్‌’ అంటూ కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి బదులుగా జగన్‌ పేరులోని గన్నుతో.. ‘మావిగన్‌’ అని అంటున్నారన్నారని, అలాగే పులివెందులకు బదులు ‘అవి గొడ్డలి’ అని అవినాశ్‌రెడ్డి పేరు పెడితే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు. ఎంతసేపు గన్నులు, గొడ్డల్లేనా? అని ప్రశ్నించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో అనంతపురం జిల్లాలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు వైఎస్‌ షర్మిల శుక్రవారం సంఘీబావం తెలిపారు. అనంతపురం రూరల్‌ మండలంలోని మన్నీల గ్రామ సమీపంలో సీపీఐ నాయకులతో కలిసి కొంతదూరం నడిచారు. అనంతరరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిర్మించాలి, కట్టాలన్న ఆలోచన జగన్‌కు ఉండుంటే అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లల్లో జలయజ్ఞం పూర్తయ్యేదన్నారు. జగన్‌ పేరులో గన్ను ఉందని, అవినాశ్‌లో నాశనం ఉందని.. ఇంక వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ నేతలు గన్నులు.. గొడ్డళ్ల గురించే మాట్లాడుతుంటారని పేర్కొన్నారు.


గాడిదలు కాశారా?.. నిద్రపోయారా?

మావిగన్‌ అంత అద్భుతమైన ఐడియా అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎందుకు అమలు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ‘ఆ ఐదేళ్లూ గాడిదలు కాశారా? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా..? లేక నిద్రపోయారా?’ అని నిలదీశారు. మావిగన్‌కు తక్కువ ఖర్చు అవుతుందనుకుంటే.. మూడు రాజధానులని ఎందుకన్నారని జగన్‌ను ప్రశ్నించారు. మావిగన్‌పై కాంగ్రెస్‌ వైఖరేంటో చెప్పాలంటూ ప్రశ్నించారని, ఎవరైనా ఈ జోక్‌ వింటే నవ్వుతారన్నారు. అమరావతిపై కాంగ్రెస్‌ వైఖరిని ఇప్పటికే ఇప్పటికే స్పష్టం చేశామని, పార్లమెంట్‌లో రాజధాని బిల్లుకు మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. అమరావతికి అప్పులివ్వొద్దని, రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని, ఎంత ఖర్చు అయితే అన్ని నిధులివ్వాలని డిమాండ్‌ చేశామని గుర్తుచేశారు. అమరావతికి కావాల్సిన ఏ సహకారమైనా కాంగ్రెస్‌ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమరావతికి మద్దతిచ్చినందుకో.. మావిగన్‌ను జోక్‌ అన్నందుకో తనను కూటమి దత్తపుత్రిక అంటూ మాట్లాడుతున్నారని, పచ్చకామెర్లు కమ్మినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని షర్మిల విమర్శించారు. జగన్‌ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారని, బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము ఆయనకు లేదన్నారు. మోదీ దత్తపుత్రుడిగా జగన్‌ ప్రతి బిల్లుకు మద్దతిచ్చారని, కాలర్‌ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఓట్లు వేయించుకున్న ఆయన.. ఒక్కసారి కూడా దాని గురించి ప్రధాని వద్ద ప్రస్తావన తేలేదని దుయ్యబట్టారు. ‘మీలాగా అక్రమ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదు.. రాదు కూడా..’ అని తూర్పారాబట్టారు. వైఎస్‌ ఐడియాలజీకి నిజమైన వారసులం తామేనన్నారు.

బొత్స బహిరంగ క్షమాపణ చెప్పాలి

గురువారం నాటి మీడియా సమావేశంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టడంపై షర్మిల స్పందిస్తూ.. ఆనాడు నిండు సభలో తన తల్లి విజయమ్మను అవమానించారని, వైఎ్‌సఆర్‌ను చులకన చేసి మాట్లాడారని, అందుకు బొత్స ఎంత ఏడ్చినా తక్కువేనన్నారు. ఆ సభలోనే తన తల్లి కంటతడి పెట్టుకున్నారని, ఇంటికొచ్చిన తర్వాత కూడా బాధపడ్డారని పేర్కొన్నారు. విజయమ్మను బాధపెట్టినందుకు పశ్చాతాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగా బొత్సకు ఉందన్నారు. విజయమ్మకు బొత్స బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 11 , 2026 | 03:23 AM