రాజధానికి కేంద్రం ఇచ్చే నిధులన్నీ అప్పులే:షర్మిల
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:42 AM
రాజధాని నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ అప్పులేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
అమలాపురం రూరల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాజధాని నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ అప్పులేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఆమె చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయని, కేవలం ఆంధ్రప్రదేశ్‌కే లేదన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు సినిమా చూపిస్తే, జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేశాడని విమర్శించారు. విభజన హామీ చట్టంలో భాగంగా రాజధానిని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. రాజధాని నిర్మాణం కోసం పార్లమెంటులో మన రాష్ట్రానికి చెందిన ఒక్క మగాడైనా లేచి ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నా కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదన్నారు. కేంద్రంలోని బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకుంటే, చంద్రబాబు బహిరంగ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.