ఈసారి కూడా కేంద్రం దగా: షర్మిల
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:22 AM
కేంద్రంలోని ఎన్‌డీఏలో సీఎం చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు గుండు సున్నా అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అసహనం వ్యక్తంచేశారు.
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని ఎన్‌డీఏలో సీఎం చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు గుండు సున్నా అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అసహనం వ్యక్తంచేశారు. ప్రతి ఏడాదీ బడ్జెట్‌లో రాష్ట్రానికి మోదీ దగా చేస్తున్నారని విమర్శించారు. ఈసారి కూడా ఏపీకి మొండిచేయే చూపారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అణాపైసా విలువ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను ఊరించి ఉసూరనిపించారని, అమరావతికి అప్పులు తప్ప ఆపన్న హస్తం అందించలేదని విమర్శించారు. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామంటూ లక్ష కోట్ల రూపాయలు ఖర్చయ్యే అమరావతికి 15వేల కోట్ల అప్పును ఇచ్చి కేంద్రం చేతులు దులిపేసుకుందని తెలిపారు. పోలవరానికి రూ.3000 కోట్లు మాత్రమే ఇచ్చి 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేసేందుకు సిద్ధమైందన్నారు. కూటమికి పెద్దన్నగా చెప్పుకునే చంద్రబాబు నోరు విప్పకపోవడం ఆయన పాలనా దక్షతకు నిదర్శనమని షర్మిల ఎద్దేవా చేశారు.