Share News

జగన్‌.. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా?

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:08 AM

‘కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం.. ప్రజల ప్రయోజనాలను కాలరాస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ పోరాడాలి. కానీ రాష్ట్రంలోని పేదల ప్రయోజనాలకన్నా జగన్‌కు మోదీ ప్రయోజనమే మిన్నగా ఉంది.

జగన్‌.. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా?

ఉపాధి పథకం పరిరక్షణ యాత్రలో షర్మిల

తెనాలి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం.. ప్రజల ప్రయోజనాలను కాలరాస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ పోరాడాలి. కానీ రాష్ట్రంలోని పేదల ప్రయోజనాలకన్నా జగన్‌కు మోదీ ప్రయోజనమే మిన్నగా ఉంది. ఒక్క మగాడు కూడా లేని ఆ పార్టీ మోదీ ఎదుట సాగిలపడింది. బీజేపీకి అమ్ముడుపోయింది’ అని పీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శించారు. కేంద్రానికి అడ్డు చెప్పేందుకు అధికార పార్టీకి అనేక అడ్డంకులు రావచ్చని, ప్రతిపక్షంలో ఉన్న నీ నోరు ఏమయ్యిందని జగన్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్త ఉపాధి హామీ పఽథకం పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలో రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమెమాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించటమే ఒక తప్పయితే, మోదీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్నే పూర్తిగా మార్చేసిందని మండిపడ్డారు. మోదీ తెచ్చిన కొత్త చట్టంతో గ్రామసభల అధికారాన్నే తొలగించారని, మన గ్రామానికి ఏం కావాలో కూడా ఢిల్లీ వాళ్లే నిర్ణయిస్తారట... అని ఎద్దేవ చేశారు. బిల్లుకు ఆనాడు మద్దతు తెలిపి, ఇప్పుడు డబ్బు కావాలంటూ ఢిల్లీ చుట్టూ చంద్రబాబు తిరగటమేంటని ప్రశ్నించారు. దీనిని జగన్మోహన్‌రెడ్డి అయినా ప్రశ్నిస్తున్నారా! అంటే అదీ లేదని, ఇది బీజేపీ పథకం కాబట్టి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్‌కు లేదన్నారు. వైసీపీ ఎంపీలయినా పార్లమెంటులో నోరు విప్పే పరిస్థితిలో లేరని, వైసీపీ ఎంపీల్లో ఒక్క మగాడూ లేకపోవటం రాష్ట్రానికి తీరని నష్టమన్నారు. బీజేపీకి బినామీలుగా, బానిసలుగా మిగిలిపోయారని విమర్శించారు. జగన్‌, చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రం రూ. 11 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు పేద ప్రజలకంటే, స్వప్రయోజనాలు, మోదీ జపమే ముఖ్యమని మండిపడ్డారు. జీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేసేవరకు పోరాటం ఆగదన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 04:09 AM