తిట్టారు.. కొట్టారు.. ప్రలోభ పెట్టారు
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:20 AM
‘శాసనమండలిలో చైర్మన్ స్థానంలో ఉన్న నాపై ఓ మంత్రి చేయి చేసుకున్నారు. గుండెలపై చెయ్యి పెట్టి తోశారు. మరో మంత్రి ఏకవచనంతో తిడుతూ కులం పేరుతో నా పుట్టుకను నిందించారు.
అయినా నాడు ధర్మం వైపు నిలబడ్డా
గత ప్రభుత్వంలో వైసీపీ సభ్యుల దూషణలు
3 రాజధానుల బిల్లు మండలికి వచ్చినపుడు రభస
నాకున్న అధికారంతో బిల్లును తిరస్కరించా: షరీఫ్
నాటి సంగతులు గుర్తుచేసుకుని కంటతడి
అమరావతి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ‘శాసనమండలిలో చైర్మన్ స్థానంలో ఉన్న నాపై ఓ మంత్రి చేయి చేసుకున్నారు. గుండెలపై చెయ్యి పెట్టి తోశారు. మరో మంత్రి ఏకవచనంతో తిడుతూ కులం పేరుతో నా పుట్టుకను నిందించారు. నీ దగ్గర డబ్బులేదు.. నీకు కావాల్సినంత ఇచ్చి బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభపెట్టారు. మాట వినకుంటే ఏకంగా మండలినే రద్దు చేస్తామని అన్నారు’ అని గత జగన్ ప్రభుత్వంలో జరిగిన సంఘటనను శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ గుర్తు చేసుకున్నారు. నాడు మూడు రాజధానుల బిల్లు మండలికి వచ్చిన సమయంలో కెమెరాలు కట్ చేశాక జరిగిన పరిణామాలను వెల్లడించారు. ఎన్ని ఒత్తిడులు తెచ్చినా.. ఎంత ప్రలోభపెట్టినా.. ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు కట్టుబడి ఉన్నానని.. తనకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లును ఆమోదించకుండా తిరస్కరించానని పేర్కొన్నారు. ఆనాటి సభలో ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించడంతో గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు తనను ఆనాడు మానసికంగా వేధించి అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. ప్రజారాజధాని కోసం రైతులు చేసిన పోరాటాన్ని మర్చిపోలేమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, దారపనేని నరేంద్ర, బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు.