Share News

శాంతికి ఉపశమనం..!

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:54 AM

దేవదాయ ధర్మాదాయ శాఖలో ధర్మం తప్పినా ఫర్వాలేదు. దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసినా తప్పులేదు. అవినీతికి పాల్పడినా, అవినీతికి సిబ్బందిని ప్రోత్సహించినా ఎలాంటి చర్యలూ ఉండవని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి విషయంలో...

శాంతికి ఉపశమనం..!

  • విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం

  • ప్రాధాన్యం లేని పోస్టులో నియమించాలని.. దేవదాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): దేవదాయ ధర్మాదాయ శాఖలో ధర్మం తప్పినా ఫర్వాలేదు. దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసినా తప్పులేదు. అవినీతికి పాల్పడినా, అవినీతికి సిబ్బందిని ప్రోత్సహించినా ఎలాంటి చర్యలూ ఉండవని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి విషయంలో నిరూపితమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ, ఎన్టీఆర్‌ జిల్లాల అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో ఆమె చేయని అక్రమాలు, అరాచకాలు లేవు. అలాంటి అధికారిణి మళ్లీ దేవుడి శాఖలో విధులు చేపట్టబోతున్నారు. హైకోర్టు, ఎస్టీ కమిషన్‌ ఆదేశాల మేరకు ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు దేవదాయ శాఖ ఎక్స్‌-అఫిషియో కార్యదర్శి హరి జవహర్‌లాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులే ఆరు అభియోగాలు నమోదు చేశారు. శాఖ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతికి పాల్పడడంతో పాటు అవినీతికి పాల్పడాలని సిబ్బందిని ప్రోత్సహించడం, భర్త విషయంలో రికార్డుల్లో ఒకరి పేరు, ప్రెస్‌మీట్‌లో మరొకరి పేరు చెప్పడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడడం, సీసీఎ నిబంధనలు తుంగలోతొక్కడం, నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు విచారణాధికారి రాజమండ్రి రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా ఆమెపై చర్యల్లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఏడాదిలోపు విచారణ పూర్తి కఠిన చర్యలు తీసుకోవాలి. ఆమెను 2024 జూలై 2న సస్పెండ్‌ చేసి, అభియోగాలు నమోదు చేసినా.. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఏపీపీఎస్సీకి లేఖ లు రాశాం, విజిలెన్స్‌ విచారణ అంటూ కాలయాపన చేసి గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. తర్వాత రాజమం డ్రి జాయింట్‌ కమిషనర్‌ రిపోర్టు ఇచ్చినా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సస్పెండ్‌ చేసిన 15 నెలల తర్వాత దేవదాయ శాఖ అధికారులు కంపల్సరీ రిటైర్మెంట్‌కు ప్రతిపాదించారు.


ఫైలు సచివాలయానికి పంపారు. ఈలోపు ఆమె హైకోర్టును, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. సస్పెన్ష న్‌ ఎత్తివేసి.. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు, జనవరి 9న ఎస్టీ కమిషన్‌ ఆదేశించాయి. దీంతో ఆమెను తిరిగి విధుల్లో తీసుకుంటున్నారు. ప్రాధాన్యం లేని పోస్టు ఇవ్వాలని హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దేవదాయ శాఖలో ఇలాంటి పోస్టులకు అవకాశం లేదు. అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి ఉన్న శాంతిని ఏదో జిల్లా ఎండోమెంట్‌ అధికారిగా లేక ఏసీ కేడర్‌ ఆలయానికి ఈవోగా లేదా మేజర్‌ ఆలయాల్లో ఏఈవోగా నియమించాలి. ఇవన్నీ ప్రాధాన్య పోస్టులే. మరి కమిషనర్‌ ఆమెను ఎక్కడ నియమిస్తారన్నది చూడాలి.

Updated Date - Mar 25 , 2026 | 04:54 AM