Share News

కూడళ్లలో ‘నీడ’

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:32 AM

బ్లేజ్‌వాడలో ఏడాది అంతా ఒక పరిస్థితి ఉంటే వేసవిలో దానికి భిన్నంగా ఉంటుంది. ఎండలు మండిపోతాయి. ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతున్నా, ఏసీలు, కూలర్లు పనిచేస్తున్నా జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. రహదారులపై రాకపోకలు సాగించే వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వారికి కొద్దిపాటి ఉపశమనం కలిగించడానికి ట్రాఫిక్‌ విభాగాధికారులు ‘పచ్చ’ప్రణాళికలను పట్టాలు ఎక్కించారు.

కూడళ్లలో ‘నీడ’

ట్రాఫిక్‌లో వేసవి ప్రణాళిక

ప్రధాన జంక్షన్ల వద్ద గ్రీన్‌మ్యాట్‌ ఏర్పాటు

వాహనదారులకు ఉపశమనం

ప్రయోగాత్మకంగా స్ర్కూబ్రిడ్జి, సీతన్నపేట జంక్షన్లలో అమలు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

బ్లేజ్‌వాడలో ఏడాది అంతా ఒక పరిస్థితి ఉంటే వేసవిలో దానికి భిన్నంగా ఉంటుంది. ఎండలు మండిపోతాయి. ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతున్నా, ఏసీలు, కూలర్లు పనిచేస్తున్నా జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. రహదారులపై రాకపోకలు సాగించే వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వారికి కొద్దిపాటి ఉపశమనం కలిగించడానికి ట్రాఫిక్‌ విభాగాధికారులు ‘పచ్చ’ప్రణాళికలను పట్టాలు ఎక్కించారు. రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు ద్విచక్ర వాహనదారులకు కొద్దిపాటి చల్లదనాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం కూడళ్లలో గ్రీన్‌మ్యాట్‌(పచ్చని పరదాలను) ఏర్పాటు చేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా రెండు కూడళ్లలో అమర్చారు.

నీడ లేని కూడళ్లు

విజయవాడ నగరంలో దాదాపుగా మొత్తం 120 కూడళ్లు ఉన్నాయి. వాటిలో 30-45 భారీ కూడళ్లు ఉన్నాయి. వేసవి కాలంలో ఈ కూడళ్ల వద్ద ఆగే వాహనదారుల నెత్తిని సూర్యుడు సుర్రుమనిపిస్తాడు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎండాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. కారులు, ఆటోలు, ఇతర వాహనాల్లో ఉన్న వారికి కూడళ్లలో రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు ఎండ దెబ్బ తగలదు. ద్విచక్ర వాహనదారులకు మాత్రం కూడళ్లలో ఆగితే మళ్లీ గ్రీన్‌ సిగ్నల్‌ పడే వరకు మాడు మాడిపోతోంది. ప్రతి కూడలిలో సుమారుగా 25-30 సెకన్లపాటు ఆగుతుంది. ఇక్కడ వేసవిలో ద్విచక్ర వాహనదారులకు కొద్దిపాటి చల్లదనం కలిగించడానికి గ్రీన్‌మ్యాట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ విభాగాధికారులు సొంత నిధులతో వాటిని అమర్చుతున్నారు. ప్రస్తుతం ఐదో ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలోని మొదటి సెక్టార్‌లో ఉన్న స్ర్కూబ్రిడ్జి వద్ద, మూడో ట్రాఫిక్‌ స్టేషన్‌ పరిధిలోని సీతన్నపేట గేటు కూడలి వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెండు కూడళ్లలో లోటుపాట్లను పరిశీలించిన తర్వాత మిగిలిన కూడళ్లలో వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ప్రజల నుంచి స్పందన

నగరంలో వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మిట్ట మధ్యాహ్నం సమయంలో ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏప్రిల్‌, మే నెలల్లో నిత్యం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కూడళ్లలో రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు వాహనదారులకు కొంత హాయిని కలిగించడానికి నీడ కోసం గ్రీన్‌మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది.

- షిరీన్‌ బేగం, ట్రాఫిక్‌ డీసీపీ

Updated Date - Mar 23 , 2026 | 12:32 AM