శభాష్ సురేంద్ర!
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:35 AM
మూడు నెలల క్రితం... కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై వి.కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైన ఘటనలో 19 మంది..
బస్సు సహాయకుడి అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం
పారిపోకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన వైనం
శిరివెళ్ల, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మూడు నెలల క్రితం... కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై వి.కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైన ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేయకపోగా అక్కడినుంచి పరారయ్యాడు. సరిగ్గా అలాంటి మరో దుర్ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి 1:15 గంటలకు చోటుచేసుకుంది. ఈసారి బస్సులో డ్రైవర్‌కు సహాయకుడిగా ఉన్న సురేంద్ర అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఆయన ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, బస్సులోని ప్రయాణికుల్లో చాలా మంది మంటలకు ఆహుతయ్యేవారే. బస్సు టైర్ పేలిన తర్వాత డివైడర్‌ను దాటి, ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సంభవించగానే అప్రమత్తమైన సురేంద్ర.. ప్రయాణికుల సహాయంతో బస్సు వెనుక వైపున్న అత్యవసర ద్వారాన్ని ధ్వంసం చేయించి కొందరిని సురక్షితంగా బయటకు చేర్చారు. శిరివెళ్లకు చెందిన యువకులు బయటి నుంచి రాళ్లు, ఇనుప రాడ్లతో బస్సు అద్దాలను పగులకొట్టి చిన్న పిల్లలు, ప్రయాణికులను కాపాడారు. ఇతర వాహనదారులు సైతం స్పందించి పలువురిని బయటకు తీసుకొచ్చారు. బస్సులో మంటలు రేగకముందే ప్రయాణికులను కాపాడటంలో వీరంతా కీలకంగా వ్యవహరించారు. నిమిషాల వ్యవధిలోనే బస్సులోని ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. కాగా, చినటేకూరు ఘటన తరహాలో ప్రమాదం జరగ్గానే తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా.. ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పాటు వారిని సురక్షితంగా కిందకు దించడంలో కీలకంగా వ్యవహరించిన సురేంద్రను అందరూ అభినందించారు. శిరివెళ్లకు చెందిన యువకులతో పాటు సురేంద్రకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.