ఎస్‌ఎఫ్ఐ నేతల కిడ్నాప్ కేసులో 13 మంది అరెస్ట్
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:56 AM
తిరుపతిలో ఎస్‌ఎ్‌ఫఐ నాయకులపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నాలకు సంబంధించిన కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు.
3 ఇన్నోవా కార్లు స్వాధీనం
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఎస్‌ఎ్‌ఫఐ నాయకులపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నాలకు సంబంధించిన కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్‌బాబు యూనివర్శిటీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎస్‌ఎఫ్ఐ , ఏఐఎస్ ఎఫ్, మరికొన్ని విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం ఉదయం కలెక్టరేట్ వద్దకు బయలుదేరారు. తిరుచానూరు బైపాస్ రోడ్డుపై ఎంబీయూకి చెందిన కొంతమంది బౌన్సర్లు, విద్యార్థులు, మరికొందరు బయటి వ్యక్తులు కలిసి వీరిని అడ్డగించారు. విద్యార్థి నేతలు అక్బర్, వినోద్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మరో ఎస్‌ఎఫ్ఐ నాయకుడు రెడ్డికుమార్ ఫిర్యాదుపై పోలీసులు అత్యంత వేగంగా స్పందించారని ఏఎస్పీ తెలిపారు. ఎంబీయూ పీఆర్వో పి.హేమంత్, కె.సురేంద్ర, పి.విశ్వేక్‌ను అదుపులోకి తీసుకుని కిడ్నాపైన విద్యార్థి సంఘ నాయకులను గంటలోనే రక్షించినట్టు చెప్పారు. నిందితులు వినియోగించిన మూడు ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్నామని, ఆ మూడూ విద్యానికేతన్ పేరు మీదే ఉన్నాయని తెలిపారు. బాధితుడు అక్బర్ మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా బుధవారం ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు. ఈ కేసుకు సమాంతరంగా.. విద్యార్థి సంఘ నాయకులు తమను డబ్బు కోసం డిమాండ్ చేశారంటూ ఎంబీయూ పీఆర్వో సతీష్ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు రవి మనోహరాచారి చెప్పారు.