Share News

ఆసుపత్రుల్లో సర్జన్ల కొరత

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:14 AM

క్షేత్రస్థాయిలో ఆరోగ్య శాఖ కుంటుపడింది. జిల్లాల్లో సరిపడా సీనియర్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజారోగ్య వ్యవస్థ పనితీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఏ జిల్లాలో ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడినా..

ఆసుపత్రుల్లో సర్జన్ల కొరత

  • పాత జిల్లాల సిబ్బందితోనే కాలయాపన

  • 28 జిల్లాలకు 112 మంది అవసరం కాగా 60-70 మంది మాత్రమే అందుబాటు

  • ఇన్‌చార్జిలుగా జూనియర్‌ వైద్యులు

  • పని భారమంతా డీఎంహెచ్‌వోలపైనే

  • సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తే కట్టడి ఎలా?

  • టీబీ, లెప్రసీ, ఆప్తమాలజీ సేవలపైనా ఎఫెక్ట్‌

  • కొత్త పోస్టుల భర్తీపై దృష్టిపెట్టని ఆరోగ్య శాఖ

ప్రస్తుతం 28 జిల్లాలకు కలిపి 112 మంది సివిల్‌ సర్జన్‌ క్యాడర్‌ వైద్యులు ఉండాలి. కానీ 60 నుంచి 70 మంది మాత్రమే ఉన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఉన్న వారినే సర్దుబాటు చేసుకుని ప్రజారోగ్య వ్యవస్థను నడిపిస్తున్నారు. వైద్యుల కొరత సేవలపై ప్రభావం చూపుతోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా పోస్టులు సృష్టించి వైద్యులను నియమిస్తే తప్ప వ్యవస్థ గాడిన పడే పరిస్థితి లేదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

క్షేత్రస్థాయిలో ఆరోగ్య శాఖ కుంటుపడింది. జిల్లాల్లో సరిపడా సీనియర్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజారోగ్య వ్యవస్థ పనితీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఏ జిల్లాలో ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడినా.. మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు విజృంభించినా కట్టడి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో సివిల్‌ సర్జన్‌ క్యాడర్‌లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో ఒక జిల్లాలో డీఎంహెచ్‌వో, అడిషినల్‌ డీఎంహెచ్‌వోతో పాటు జిల్లా టీబీ అండ్‌ లెప్రసీ ఆఫీసర్‌, జిల్లా అంధత్వ నివారణ ఆఫీసర్‌తో కలిపి నలుగురు సివిల్‌ సర్జన్‌ క్యాడర్‌ వైద్యులు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో డీఎంహెచ్‌వో మాత్రమే సివిల్‌ సర్జన్‌ క్యాడర్‌లో ఉన్నారు. మిగిలిన మూడు పోస్టుల్లో జూనియర్‌ వైద్యులను ఇన్‌చార్జిలుగా పెట్టుకుని నడిపిస్తున్నారు. సివిల్‌ సర్జన్ల కొరత కారణంగా పీహెచ్‌సీల్లో ఉన్న జూనియర్‌ వైద్యులు, కిందిస్థాయి సిబ్బందిపైనే ఆధారపడాల్సి వస్తోంది. సివిల్‌ సర్జన్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డీఎంహెచ్‌వోలపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది.


జిల్లాల్లో ఏ మూల ఏమి జరిగినా పరుగులు తీయాల్సిన పరిస్థితి. దీంతో అన్ని సమస్యలపై డీఎంహెచ్‌వోలు దృష్టి పెట్టలేకపోవడం కూడా ప్రజారోగ్య వ్యవస్థ కుంటుపడడానికి కారణమవుతోంది. ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. జిల్లాల విభజన సమయంలో పాత జిల్లాల్లో ఉన్న డీఎంహెచ్‌వోలను అక్కడే కొనసాగించి, కొత్త జిల్లాలకు అడిషినల్‌ డీఎంహెచ్‌వోలను డీఎంహెచ్‌వోలుగా నియమించారు. మిగిలిన సిబ్బందిని కూడా సర్దుబాటు చేసుకున్నారు. జిల్లాల విభజన జరిగిన దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా గతంలో చేసిన సర్దుబాటుకు అనుగుణంగానే సిబ్బందిని కొనసాగిస్తున్నారు. కొత్త జిల్లాలకు కొత్త పోస్టుల కేటాయింపుపై ఆరోగ్య శాఖ దృష్టి పెట్టడం లేదు. దీనివల్ల అత్యవసర సేవలతో పాటు టీబీ, లెప్రసీ, ఆప్తమాలజీ సేవలపైనా ఎఫెక్ట్‌ పడుతోంది.


ఎన్‌హెచ్‌ఎంలోనూ..

డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లోనూ సివిల్‌ సర్జన్‌ క్యాడర్‌ వైద్యుల కొరత ఉంది. ఆయా విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ప్రజారోగ్య పథకాల నిర్వహణకు సరిపడినంత మంది సివిల్‌ సర్జన్లు అందుబాటులో లేరు. దీంతో జూనియర్‌ వైద్యులను, డిప్యూటీ సివిల్‌ సర్జన్లను ప్రోగ్రామ్‌ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సంజీవని కార్యక్రమానికి కూడా కుప్పంలో రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ను నోడలాఫీసర్‌గా నియమించాల్సి వచ్చింది. సంజీవని కార్యక్రమం మొత్తం ఆరోగ్య శాఖకు సంబంధించినది. రోగులకు రక్త పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, రోగులకు ఆస్పత్రుల్లో వైద్యుల అపాయింట్‌మెంట్‌ ఇప్పించడం వంటి బాధ్యతలను బాగా అనుభవం ఉన్న సివిల్‌ సర్జన్‌ స్థాయి సీనియర్‌ వైద్యులకు అప్పగించాలి. కానీ సివిల్‌ సర్జన్‌ క్యాడర్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు చేయాల్సిన విధులను వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన నాన్‌ మెడికల్‌ అధికారులు నిర్వహిస్తున్నారు.


ట్రస్ట్‌లో చిత్రాలు..

ఒకవైపు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ (డీహెచ్‌), ఎన్‌హెచ్‌ఎం, జిల్లాల్లో సివిల్‌ సర్జన్‌ క్యాడర్‌ వైద్యుల కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. ఎన్టీఆర్‌ వైద్య సేవ అధికారులు చిత్ర, విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో విధులు నిర్వహించేందుకు సివిల్‌ సర్జన్‌ వైద్యులను పంపించాలని డీహెచ్‌కు లేఖలు రాస్తున్నారు. డీహెచ్‌లో సివిల్‌ సర్జన్‌ వైద్యుల్లో మెజార్టీ శాతం ఎంబీబీఎస్‌ క్యాడర్‌ వాళ్లే ఉంటారు. పైగా వారంతా పబ్లిక్‌ హెల్త్‌లో అత్యంత అనుభవం కలిగి ఉంటారు. వారి సేవలు జిల్లాల్లో చాలా అవసరం. ఎపిడిమిక్స్‌ వచ్చినప్పుడు జిల్లాల్లో వారి అవసరం ఎంతో ఉంటుంది. పబ్లిక్‌ హెల్త్‌లో అనుభవమున్న వైద్యులను తీసుకువచ్చి డెస్క్‌ పోస్టుల్లో కూర్చోబెట్టాలన్న అనాలోచిత నిర్ణయాలను ట్రస్ట్‌ అధికారులు తీసుకుంటున్నారు. దీనిపై కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సివిల్‌ సర్జన్ల కొరత కారణంగా డీహెచ్‌ కూడా వైద్యులను పంపించే పరిస్థితి లేదు. ట్రస్ట్‌ అధికారులు డీఎంఈలో సీనియర్‌ వైద్యుల సేవలు ఉపయోగించుకోవడం మంచిదన్న సూచనలు వస్తున్నాయి.

Updated Date - Apr 15 , 2026 | 05:15 AM