Share News

ప్రాజెక్టుల్లో ఇంజనీర్లు ఏరీ?

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:54 AM

రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా పలు ప్రాజెక్టుల్లో యాజమాన్య నిర్వహణ కరువైంది. సిబ్బంది కొరతే దీనికి కారణం. అవసరమైనంత మంది ఇంజనీర్లు, లస్కర్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రాజెక్టుల్లో ఇంజనీర్లు ఏరీ?

  • 1,523 పోస్టులు ఖాళీ.. 250 భర్తీకే అనుమతి

  • ఆపత్కాలంలో అప్రమత్తం చేసే లస్కర్లూ కరువే

  • 7,224 మంది అవసరమైతే ఉన్నది 1,517 మందే

  • వీరిలో 1,033 మంది అవుట్‌ సోర్సింగ్‌ వాళ్లే

  • మంత్రి నిమ్మల కృషితో వీరికి జీతాలు పెంపు

  • కానీ ఇప్పటికీ చెల్లించని వైనం

  • ఇలాగైతే ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ ఎలా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా పలు ప్రాజెక్టుల్లో యాజమాన్య నిర్వహణ కరువైంది. సిబ్బంది కొరతే దీనికి కారణం. అవసరమైనంత మంది ఇంజనీర్లు, లస్కర్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2009 సెప్టెంబరు తరహాలో ఎగువ నుంచి అనూహ్యంగా భారీ వరద వస్తే ప్రాజెక్టుల భవిత ఏమిటని జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ శాఖలో 4,739 ఇంజనీరింగ్‌ పోస్టులకు గాను 1,523 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఉగాది నాడు విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో ఈ శాఖలో 250 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. కేవలం ఐదో వంతు పోస్టులు భర్తీచేస్తే ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ ఎలాగని ఇంజనీరింగ్‌ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ఒక్కో ఇంజనీరు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. తలకుమించిన భారంతో ఎన్నాళ్లు పనిచేస్తారని నిలదీస్తున్నాయి. ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను కాపాడుకోవడానికి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషించే జూనియర్‌ ఇంజనీర్లు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు. 1,050 మంది జూనియర్‌ ఇంజనీర్లకుగాను 856 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చివరకు రాష్ట్రస్థాయిలో 3 ఈఎన్‌సీ పోస్టులు ఉంటే.. రెండు ఖాళీగా ఉన్నాయి.


శ్రీశైలం ప్రాజెక్టులో..

శ్రీశైలం జలాశయం స్పిల్‌వేకు ముందు ఏర్పడిన ప్లంజ్‌పూల్‌ (భారీ గొయ్యి).. దెబ్బతిన్న సిలిండర్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో గతంలో కొట్టుకుపోయిన అప్రోచ్‌ రోడ్‌ పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది. జలాశయం మరమ్మతు పనులకు దాదాపు రూ.200 కోట్ల దాకా వ్యయం అవుతుంది. ఈ నిధులు మంజూరు చేయకుండా ఆర్థిక శాఖ తాత్సారం చేస్తోంది. దీంతో పనులు జరగడం లేదు. జలాశయం ప్రమాదంలో పడిందని ఇంజనీరింగ్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాం పర్యవేక్షణ కోసం 42 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (ఏఈఈ) అవసరం కాగా.. 31 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 11 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల (డీఈఈ)కు గాను 8 పోస్టులు ఖాళీ. ఉండాల్సిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు (ఈఈ) లేరు. ఇక ఆపత్కాలంలో అధికారులను అప్రమత్తం చేసే లస్కర్లు కూడా లేరు. రాష్ట్రవ్యాప్తంగా 7,224 మంది లస్కర్లు అవసరం కాగా.. ప్రస్తుతం కేవలం 1,517 మందే పనిచేస్తున్నారు. వీరిలోనూ 1,033 మంది కూటమి ప్రభుత్వం వచ్చాక అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమితులైనవారే. దశాబ్దాలుగా వీరిని సాంకేతికత లేని కేటగిరీలో చూపుతూ.. రోజుకు రూ.350 చొప్పున వేతనం ఇస్తూ వచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడి కృషి కారణంగా వీరి వేతనాన్ని రూ.550కి పెంచినా.. పెంచిన వేతనాలు ఇప్పటికీ ఇవ్వలేదు. పైగా వైసీపీ ప్రభుత్వం వీరికి 9.16 కోట్లు బకాయి పెట్టి పోయింది. కూటమి ప్రభుత్వం కూడా చెల్లించలేదు.

Updated Date - Mar 31 , 2026 | 04:55 AM