సన్‌డే సలసల!
ABN , Publish Date - May 25 , 2026 | 05:38 AM
భానుడి భగభగలు, తీవ్రమైన వడగాడ్పులతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. ఆదివారం ఎండ మరింత తీవ్రరూపం దాల్చింది. చీకటి పడిన తర్వాత కూడా వడగాడ్పులతో వేడి వాతావరణం కొనసాగింది.
సాధారణం కంటే 8 డిగ్రీలు ఎక్కువ
రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు
13 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదు
174 మండలాల్లో 44 డిగ్రీలు దాటింది
వడదెబ్బకు 8 మంది మృతి
సాయంత్రం ఈదురుగాలులతో వర్షం
మరో 3 రోజులు మంటలే: విపత్తు సంస్థ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
భానుడి భగభగలు, తీవ్రమైన వడగాడ్పులతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. ఆదివారం ఎండ మరింత తీవ్రరూపం దాల్చింది. చీకటి పడిన తర్వాత కూడా వడగాడ్పులతో వేడి వాతావరణం కొనసాగింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. వడదెబ్బకు ఏలూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. రాజస్థాన్ ఎడారి నుంచి మధ్యభారతం మీదుగా వీచిన వేడిగాలులతో కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలూ అగ్నిగుండంలా మారాయి. సముద్ర తీర ప్రాంతాల్లోనూ సెగలు కక్కేలా వేడి వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల మేఘాలతో కొంతసేపు ఉపశమనం కలిగినా, అనేకచోట్ల ఆకాశం నిర్మలంగా ఉండి, సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడంతో వేడి తీవ్రత పెరిగింది. కోస్తాలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు, మిగిలిన ప్రాంతాల్లో వడగాడ్పులు వీశాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-8 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అత్యధికంగా 49 డిగ్రీలు, అదే జిల్లా చిట్యాలలో 48.3, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలలో 47.3, కృష్ణా జిల్లా నందివాడలో 47.1, కోనసీమ జిల్లా రామచంద్రాపురం, కాకినాడ జిల్లా కాజులూరులో 46.5, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.2, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 45.7, విశాఖ రూరల్‌లో 45.6, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా, 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో సాయంత్రం బెజవాడ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.
నేడు పది జిల్లాల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రత..
రాష్ట్రంలో మరో 3రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారాలు కోస్తాలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. సోమవారం కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 45-47, విజయనగరం, మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో 43-45, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. ద్రోణి ప్రభావంతో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. వాయవ్యభారతంలో వాతావరణం చల్లబడితే తప్ప మధ్యభారతం, దానికి ఆనుకొని ఉన్న ఏపీ, తెలంగాణలో వడగాడ్పుల తీవ్రత తగ్గే అవకాశం లేదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.