Share News

ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:19 AM

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి ఆచూకీ లభించగా...

ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

  • 1న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు

  • తర్వాత అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలం

  • 4వ తేదీకల్లా ఇంటికి చేరుకోవాలని నిర్ణయం

  • చేరకపోవడంతో అధికారులకు చెప్పిన కుటుంబసభ్యులు

  • అప్రమత్తమైన అధికారులు.. గాలింపు చర్యలు ముమ్మరం

  • స్పందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌

  • విశాఖ కలెక్టర్‌కు ఫోన్‌.. చేపట్టిన రక్షణ చర్యలపై ఆరా

  • మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన కొండపల్లి

  • ఒకరిని కాపాడిన రవాణా నౌక సిబ్బంది

  • మిగిలిన వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు

విశాఖపట్నం/ బీచ్‌రోడ్డు, అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి ఆచూకీ లభించగా... మిగిలిన ఆరుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు, సహచర మత్స్యకారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారి చిన్న, కారి గరగయ్య, అమర అప్పలరాజు, కారి చిన్నయ్య, కారి సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెద నాగయ్యపాలేనికి చెందిన రగపతి బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఈ నెల 1న ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి బోటులో బయల్దేరి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి.. సముద్రంలో పరిస్థితిని తెలియజేశారు. శనివారం (ఈనెల 4న) నాటికి ఇంటికి తిరిగి వచ్చేస్తామని చెప్పారు. కానీ వారు తీరానికి (ఫిషింగ్‌ హార్బర్‌) చేరకపోవడంతో కుటుంబసభ్యులు వారికి ఫోన్లు చేశారు. స్విచ్చాఫ్‌ వస్తుండడంతో ఆందోళన చెంది.. అధికారులకు సమాచారం ఇచ్చారు.


దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయ బృందాలను రంగంలోకి దించి.. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టగా బోటు ఆచూకీ లభించలేదు. అయితే బోటు యజమాని కారి చిన్నను ఓ రవాణా నౌక సిబ్బంది కాపాడారు. కాగా, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం నేవీ, కోస్టుగార్డు, మెరైన్‌ పోలీస్‌ బలగాలు గాలిస్తున్నాయి. కాగా, విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఒకరిని కాపాడిన రవాణా నౌక

సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో కారి చిన్న అనే వ్యక్తిని సరుకు రవాణా చేసే ‘ఎంవీ యూనివర్స్‌ వెల్తీ మర్చంట్‌ నౌక’ సిబ్బంది కాపాడారు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆ మార్గంలో వస్తున్న రవాణా నౌకా సిబ్బంది.. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారుల బోటును గుర్తించారు. మత్స్యకారులు కూడా ఈ నౌకను గమనించి, ఈదుకుంటూ దాని వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో నౌక కెప్టెన్‌.. లైఫ్‌ రింగులు, తాళ్లను సముద్రంలోకి వేశారు. నౌక వద్దకు చేరుకున్న కారి చిన్నను లైఫ్‌ రింగ్‌ సహాయంతో కాపాడగలిగారు. ఆ సమయంలో గాలులు ఉధృతంగా వీస్తుండడం, సుమారు మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మిగిలిన వారిని కాపాడేందుకు రెస్క్యూ బోట్లను సముద్రంలోకి దించే పరిస్థితి లేకపోయింది. దీనిపై నౌక కెప్టెన్‌ ఇచ్చిన సమాచారం మేరకు... వెంటనే కాకినాడ నుంచి మరో నౌకను పంపించి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. కారి చిన్నను కాపాడిన ప్రాంతంలో నాలుగు నౌకలు, నేవీ హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు కొనసాగించారు. సాయంత్రం వరకు గాలించిన ఈ బృందాలు, చీకటి పడిన తర్వాత నిలిపేశాయి. సోమవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలను ప్రారంభిస్తాయని అధికారులు చెబుతున్నారు.


సీఎం, డిప్యూటీ సీఎం ఆరా..

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వెంటనే విశాఖ జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కోస్టుగార్డు నౌకలు, నేవీ హెలికాప్టర్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పవన్‌ కల్యాణ్‌ కూడా విశాఖ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మెరైన్‌ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకరాంతో మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా... మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే సీహెచ్‌ వంశీకృష్ణ శ్రీనివాస్‌, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, ఇతర అధికారులు ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుకున్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మత్స్యకారులను రక్షించేందుకు ప్రయత్నాలు: అచ్చెన్న

గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరిని ప్రైవేటు సరుకు రవాణా నౌక సిబ్బంది కాపాడగలిగారని, మిగిలిన వారిని కూడా రక్షించేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కాగా, మరో ఘటనలో ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన మరో బోటులోని 10 మందిని సురక్షితంగా కాపాడినట్టు మంత్రి ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఒడిశా మెరైన్‌ పోలీస్‌ సకాలంలో స్పందించడంతో మత్స్యకారులందరూ క్షేమంగా బయటపడ్డారని చెప్పారు. మత్స్యకారులను వారి స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Updated Date - Jul 06 , 2026 | 05:20 AM