గోడ కూలి విద్యార్థి మృతి
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:16 AM
అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ పక్కనే శిథిలావస్థకు చేరిన షెడ్ గోడ కూలి విద్యార్థి హర్షవర్దన్ తేజ (13) మృతిచెందగా మరో విద్యార్థి గాయపడ్డాడు.
మరొకరికి తీవ్రగాయాలు
శెట్టూరు(కళ్యాణదుర్గం), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ పక్కనే శిథిలావస్థకు చేరిన షెడ్ గోడ కూలి విద్యార్థి హర్షవర్దన్ తేజ (13) మృతిచెందగా మరో విద్యార్థి గాయపడ్డాడు. శెట్టూరు ఎస్‌ఐ సుమన్ తెలిపిన వివరాలు....కళ్యాణదుర్గం మండలం మల్లేపల్లికి చెందిన హర్షవర్దన్ తేజ శెట్టూరు ఎస్సీ వసతి గృహంలో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థి అక్షయ్‌తో కలిసి ఆదివారం ఆడుకుంటూ పక్కనే ఉన్న పాడుబడిన షెడ్ వద్దకెళ్లాడు. ఆసమయంలో షెడ్ గోడ కూలి విద్యార్థులపై పడింది. గాయపడిన ఇద్దరిని శెట్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా హర్షవర్దన్ తేజ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్షయ్ కాలు పూర్తిగా విరిగిపోయింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.